( రామకృష్ణమఠం వారి ప్రచురణల ఆధారంగా.. )
నిత్యానిత్య వస్తు వివేకంతో సర్వసంగ పరిత్యాగం గావించి, బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరించి, ఇహసంసారం నుండి తాము తరించడమే గాకుండా, భగవదంశ గల కొందరు మహనీయులు, సమస్త ప్రజలకు మార్గదర్శులై వెలుగొందుతూ వుంటారు. అట్టివారిలో స్వామీ వివేకానంద ఒకరు. వారి జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలను రోజూ కొంత తెలుసుకుందాం.
* * *
స్వామి తలపెట్టిన ఉద్యమం అమెరికాలో అఖండ విజయం సాధించింది. న్యూయార్కులో స్వామి ఒక వేదాంతసంఘాన్ని నెలకొలిపి, ‘ ఫ్రాన్సిస్ లేగెట్ ‘ అనే మహనీయుడిని దానికి అధ్యక్షునిగా చేసి, వేదాంతబోధ, అనుష్టాన కేంద్రం, సర్వమతసమభావన అనే ఆశయాలతో నడపసాగారు. అది మంచిప్రచారం సంపాదించి, అందులోని సభ్యులను వేదాంతులుగా ప్రజలు గుర్తించసాగారు.
1896 ఏప్రిల్ లో మళ్ళీ స్వామీ వివేకానంద లండను వెళ్లారు. కొద్దిరోజులలోనే, అక్కడి శిష్యుల సహకారంతో యోగశాస్త్ర, జ్ఞానశాస్త్ర ఉపన్యాసాలు నిర్వహించసాగారు. వేలాది జనం శ్రద్దగావింటూ ఆ చర్చలలో పాల్గొనసాగారు. అనేకసంఘాల వారు కూడా స్వామిని ఉపన్యసించమని పిలువసాగారు.
అలా ఒకసభలో మాట్లాడుతుండగా, ప్రఖ్యాత తత్వవేత్త అయిన ఒక వృద్ధుడు, ' స్వామీ ! మీ ఉపన్యాసం యెంతో బాగున్నది. మీకు కృతజ్ఞతలు. అయితే నాకు ఇందులో కొత్తవిషయాలు ఏమీ కనబడలేదు. ' అని తమ అభిప్రాయం లేచి నిలబడి సభలోచెప్పగా, స్వామి చిరునవ్వుతో, ' మీరు చెప్పినది సత్యము. నేను మీకు చెప్పిన తత్వము, చాలా పురాతనమైనది. అందువలన మీకు సహజంగానే కొత్తగా అనిపించక పోవచ్చు. సృష్టికర్త, మానవకోటి, ఈ పర్వతాలు యెంత ప్రాచీనమైనవో, ఈ తత్వమూ అంతే ప్రాచీనమైనది. కాబట్టి నా బోధనలు మీకు కొత్తగా అనిపించే అవకాశం లేదు. ' ….
అని సమాధానం చెప్పగా, ఆ వృద్ధునితో సహా, అందరూ హర్షధ్వానాలతో ఆ సమాధానానికి అంగీకార పూర్వకంగా తలవూపి, చప్పట్లు కొట్టారు.
స్వామి, ' మా మతంలో ఈ తత్త్వం వున్నది, మీ మతంలో అదిలేదు ' , అని వాదులాడు కోకుండా, ఈ ' తత్వమసి' అనే మహావాక్యం గురించి ఆలోచించండి.' అని స్వామి దానిపై దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి, వారిని సంతృప్తులను చేసారు.
ఆ సమయంలోనే స్వామి ‘ మాక్స్ ముల్లర్ ‘ మహాశయుని తో ఆయన ఆహ్వానం మేరకు సమావేశమై, సమావేశము అనంతరం, ' నేను వారి దర్శనం కోసం వెళ్లినట్లు నాకు అనిపించింది. మాక్స్ ముల్లర్ కు గురుదేవులంటే యెంతో ప్రీతి. వారి ఆశ్రమ నిర్వహణ పద్ధతులు యెంతగానో మెచ్చుకున్నారు. ' అని చెబుతూ….
' ఆ మహాశయుడిని భారతదేశ పర్యటనకు ఆహ్వానిస్తే, వారిచ్చిన సమాధానం నన్ను కంటతడి పెట్టించింది. వారు కంటిపొరలలో నీళ్లు నిండగా, తలపంకిస్తూ, గద్గద స్వరంతో, ' నేను భారతదేశానికి వస్తే మళ్ళీ తిరిగి ఈ దేశం రాలేను. అక్కడే మీరు నాకు అంత్యక్రియలు జరపాల్సివస్తుంది. ' అని వారు అన్నారు, ' అని స్వామి చెప్పారు.
స్వామి ఇచ్చిన ప్రోత్సాహంతో, శారదానంద స్వామి పంపిన రామకృష్ణుల బోధలు తదితర పుస్తకాలను దగ్గర పెట్టుకుని, మాక్స్ ముల్లర్ గారు ' రామకృష్ణుల జీవితం -వారి బోధనలు ' అనే పుస్తకం రచించి పాశ్చాత్య ప్రజలకు విలువైన కానుకగా ఇచ్చారు.
ఈ విధంగా లండన్ నగరంలో కూడా స్వామిఉద్యమం జయప్రదమై, నలుగురు అతి విలువైన శిష్యులను స్వామి సంపాదించుకున్నారు. వారే గుడ్విన్, సోదరి నివేదిత, Xavier దంపతులు. వారిని స్వామి ‘ వేదాంత ఉద్యమ ఉద్యానవనంలో లభించిన దివ్య కుసుమాలు ‘ గా స్వామి అభివర్ణించారు.
ఆ విధంగా లండన్మహోద్యమం సాగుతుండగా, కార్యభారంతో స్వామి అలిసిపోయి వుండడం చూసి, శిష్యులు విహారయాత్రగా, స్వామిని పారిస్ మీదుగా జెనీవా తీసుకువెళ్లి, అక్కడినుంచి విమానంలో ఆల్ప్స్ పర్వతాల్లోని మంచుకొండలు చూపించి స్విట్జర్లాండ్ తీసుకువెళ్లగా, అక్కడి ప్రకృతి అందాలు చూసి స్వామి పరవశించి పోయారు.
అక్కడనుంచి కీల్ పట్టణానికి వెళ్లి స్వామి ‘ డోయిసన్ ‘. పండితుని ఆహ్వానం మేరకు ఆయనను కలిసి వేదాంత విషయాలను చర్చించారు. ఆ తరువాత స్వామి, ‘ భారత దేశానికి ముఖ్యస్నేహితులు ఎవరైనా వున్నారంటే వారు ఇద్దరే, ఒకరు మాక్స్ ముల్లర్ వేరొకరు డోయిసన్ ‘ అని తన అభిప్రాయం వెలిబుచ్చారు.
ఆయన గృహంలో ఆతిధ్యం స్వీకరించిన ఆరువాత స్వామి లండను బయలుదేరారు. స్వామిని వదిలి పెట్టలేక డోయిసన్ కూడా స్వామితో లండను బయలుదేరారు.
స్వామి నూతనోత్సాహంతో లండను వచ్చారు.
స్వస్తి. .
వివేకానందుని జీవితస్పూర్తితో మరికొంత రేపు.
ప్రేమతో,
గండవరపు ప్రభాకర్.
స్వామి వివేకానంద, మాక్స్ ముల్లర్ గారితో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి