( రామకృష్ణమఠం వారి ప్రచురణల ఆధారంగా.. )
నిత్యానిత్య వస్తు వివేకంతో సర్వసంగ పరిత్యాగం గావించి, బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరించి, ఇహసంసారం నుండి తాము తరించడమే గాకుండా, భగవదంశ గల కొందరు మహనీయులు, సమస్త ప్రజలకు మార్గదర్శులై వెలుగొందుతూ వుంటారు. అట్టివారిలో స్వామీ వివేకానంద ఒకరు. వారి జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలను రోజూ కొంత తెలుసుకుందాం.
క్రైస్తవులలో ఆరోజులలో విపరీతమైన పరమత ద్వేషం ఉండేదని తెలిసి స్వామి ఆశ్చర్యపోయారు.
ఇంకొకసారి, స్వామీ వివేకానంద ప్రసంగిస్తున్న సమయంలో, కొంతమంది వారి మనో నిబ్బరాన్ని పరీక్షించాలని, ప్రసంగమధ్యంలో తుపాకీ గుళ్లను స్వామి వైపు గురిచూసి పేల్చారు. కర్ణకఠోరమైన శబ్దాలతో ఆ తుపాకీలు గుళ్లవర్షాన్ని స్వామి చెవులకు ఇరువైపుల నుంచీ పంపిస్తున్నా, స్వామి చెక్కు చెదరకుండా, తమ ఆధ్యాత్మిక ప్రసంగ పాఠం కొనసాగించి వారిని నిశ్చేష్టులను చేసారు.
మరొకసారి స్వామి ప్రయాణంలో వుండగా, ఒక నల్లజాతీయుడు కూలీవృత్తిలో జీవించేవాడు, ప్రయాణమధ్యంలో స్వామిని సమీపించి, ' మాజాతిలో మీలాంటి మహానుభావుడు పుట్టడం మా అదృష్టం. మీతో ఒకసారి కరచాలనం చేసే భాగ్యం ప్రసాదించండి. ' అని అడగగా, స్వామి అమితప్రేమగా ఆ నల్లజాతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ, అతడితో కరచాలనం చేసారు.
ఇలాంటి మంచి అనుభవాలతో బాటుగా, స్వామి కొన్ని చేదు అనుభవాలు రుచిచూశారు. అనేక భోజనశాలలలో స్వామిని నల్లజాతీయునిగా భావించి ఆయనను లోనికి అనుమతించక పోవడం జరిగేది. ఆఖరికి, క్షౌరశాలలో కూడా యిలాంటి అవమానాలు ఎదురై, స్వామి లోనికి వెళ్లకుండా అడ్డుపడడం జరిగింది.
ఇంత జరిగినా, స్వామి తాను వారనుకుంటున్న నల్లజాతి వాడిని కానని చెప్పలేదు. ఇవన్నీ చూస్తూ తట్టుకోలేని ఒకపాశ్చాత్య శిష్యుడు, ఆయనను, ' మీరు నీగ్రో సంతతి వారు కాదని ఎందుకు చెప్పడం లేదు ? ' అని బాధగా అడిగాడు. దానికి స్వామి చెప్పిన సమాధానం ఆ పాశ్చాత్య శిష్యుని నివ్వెర పరచింది. స్వామి అతనితో, ' నేను నీగ్రోను కాదని చెబితే, నీగ్రోలను నేను తక్కువవారిగా చూసినట్లే కదా ! పరులను అణచివేసి పైకివచ్చే ఘోరకృత్యాలు చేయడానికి నేను జన్మించలేదు. ' అని చెప్పారు. అదీ స్వామి వ్యక్తిత్వం.
స్వామి ఉపన్యాస పరంపర కొనసాగుతూనే వున్నది. రోజు రోజుకీ ఆహ్వానాలు పెరుగుతున్నాయి, కానీ తరగడం లేదు. అద్వైత సిద్ధాంతాన్ని పాశ్చాత్య దేశాలలో విస్తరించే ఉద్దేశ్యంతో, స్వామి వారానికి పన్నెండు నుంచి పధ్నాలుగు ఉపన్యాసాలు ఇచ్చేవారు. అంటే సుమారుగా రోజుకు రెండు ఉపన్యాసాలు ప్రతిరోజూ వుండేవి.
పరమాత్మ కృప వుండడం వలననే స్వామి ఆ విధంగా పరిశ్రమించ గలిగేవారు. ఒక్కొక్కసారి, మరునాడు ఆయన చెప్పవలసిన ఉపన్యాసాన్ని, ఎవరో ఒకవ్యక్తి తనముందు నిలబడి ఉపన్యసిస్తున్నట్లు వినవచ్చేదట, స్వామికి. దానినే మరునాడు స్వామి ఉపన్యాసంగా చెప్పేవారు. ఎంత ఆశ్చర్యం, ఆ వ్యక్తి ఈశ్వరుడు లేదా తన గురుదేవుడు అని అనిపించడంలో ఏవిధమైన తప్పూ లేదు కదా ! .
అనేక యోగసిద్ధులు ఆ సమయంలో అప్రయత్నంగా స్వామికి అలవడ సాగాయి. అవి ఎలాంటివంటే, తమ గురుదేవులు రామకృష్ణ పరమహంస వారివలె, స్వామీ వివేకానందులు కూడా కేవలం స్పర్శ మాత్రానే ఇతరుల జీవితాలను మార్చగలిగేవారు. ఆయన సోదరశిష్యులు చెప్పినదాని ప్రకారం, స్వామి, యెదుటివారి ముఖం చూడగానే వారి పూర్వజన్మ వృత్తాంతం స్వామికి కరతలామలకంగా వుండేది.
ఇది ఇలావుండగా, కలకత్తాలో కొందరు ప్రముఖులు స్వామి ఉపన్యాసాలను రాజకీయ భావ గర్భితాలుగా ప్రచారం చేయసాగారు. చూసారా ! ప్రతికూలవర్గం ఏర్పడానికి ఏ కారణమూ అక్కరలేదని దీనిని బట్టి తెలియడం లేదూ !
ఈ విషయం తెలుసుకున్న స్వామి తీవ్రంగానే స్పందించారు. తన మాటలకూ, చేతులకూ రాజకీయరంగు పులమవద్దని వారికి తన మద్రాసు శిష్యుని ద్వారా వర్తమానం పంపారు.
తనను రాజకీయ ప్రతినిధిగా ఎవరైనా చిత్రీకరిస్తే, వారు తగిన ఋజువులు చూపాలనీ, లేకపోతే, వారి మూర్ఖపు ప్రకటనలను వాపసు తీసుకోవాలనీ హెచ్చరించారు, స్వామి. తరువాత కొంతకాలానికి తమను రాజకీయ ప్రతినిధిగా భావించడం అక్కడి మిత్రులకు గొప్పగా అనిపించి ఆవిధమైన ప్రచారం చేస్తున్నారని, స్వామి గ్రహించారు. వెంటనే, స్వామి, ' పరమేశ్వరా ! ఈ మిత్రుల బారినుండి నన్ను రక్షించు. ' అని మొరబెట్టుకున్నారు.
అలా ప్రచారం చేస్తున్నవారిని, శత్రువులుగానే పరిగణిస్తూ స్వామి, తన మౌనమే వారికి సమాధానంగా వూరికే ఉండిపోయారు. తమశిష్యులతో, ' నా మౌనమే కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరిగా పనిచేస్తుంది. వారితో వాదించి నా స్థితిని దిగజార్చుకోలేను. వారు నేర్చుకోవలసిన యింకా అనేక విషయాల మీద వారిని శ్రద్ధ పెట్టమను. ' అని ఆదేశించారు.
ఇక స్వామీ వివేకానందుడు సంకల్పించిన మహోద్యమం అమెరికాఖండంలో ఎలా వ్యాపించిందో చూద్దాం.
స్వస్తి. .
వివేకానందుని జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికరవిషయాలు - 50 .
స్వామీ వివేకానందుడు సంకల్పించిన మహోద్యమం అమెరికాఖండంలో ఎలా వ్యాపించిందో చూద్దాం.
మహాసభలలో, స్వామి ఉపన్యాసం ముగిసిన తరువాత, అట్లా౦టిక్ మహాసముద్రతీరం నుంచి మిసిసిపి నదీతీరం వరకు వున్న అన్ని ముఖ్యనగరాలలో ఒక సంవత్సరకాలం స్వామి ఉపన్యసించారు. అనేకసంఘాలు, సభలు స్వామిని ఆహ్వానించాయి.
గ్రీనేకర్ దేశీయ మహాసభలలో వేదాంతతత్వాన్నిబోధిస్తూ, అనేక పర్యాయాలు స్వామి ఉపన్యసించారు. శ్రోతలంతా, భక్తి భావంతో పద్మాసనంలో కూర్చుని వుండగా, స్వామి ఒక వృక్షం క్రింద నిలబడి బోధించేవారు. అప్పటినుంచి ఆ వృక్షానికి ' స్వామి వృక్ష ' అని పేరు వచ్చింది. బ్రూక్లిన్ నగరంలో అయితే, స్వామి అప్పుడప్పుడు చేసిన ప్రసంగాలకు ముగ్ధులై, అక్కడి వారంతా ప్రతిరోజూ స్వామిని అక్కడవుండి బోధించమని కోరారు. స్వామి వారి కోరికను మన్నించి వారికి అనుదిన ప్రసంగాలు యిచ్చారు, కొన్నిరోజుల పాటు.
అక్కడ స్వామి ప్రసంగించిన, ' సనాతన ధర్మ సందేశం ' గురించి బ్రూక్లిన్ స్టాండర్డ్ ' అనే పత్రిక, ఆ ఉపన్యాసాలు అమృతతుల్యాలని ప్రశంసి౦చింది. సనాతన ఋషీశ్వరులే అక్కడ నిలబడి ప్రసగించినట్లుగా అక్కడికి వచ్చిన క్రిక్కిరిసి జనసమూహం భావించారని ఆ పత్రిక పేర్కొన్నది. .
స్వామి, ఆతరువాత న్యూయార్కు నగరంలో ప్రతిరోజూ సనాతన ధర్మతత్వాలను బోధించారు. అక్కడ కూడా జనం విపరీతంగా వచ్చి స్వామివారి వాక్కులకు ప్రభావితులు అయ్యారు. అసమయంలోనే మిస్ వాల్డో, ( తరువాతి కాలంలో ఆమె స్వామి శిష్యురాలు హరిదాసి గా మారినది ) తన అనుభవాలను యిలా చెప్పింది :
' 1895 ఫిబ్రవరి నెలలో పాఠాలు ప్రారంభం అయ్యాయి. రోజు రోజుకీ పెరుగుతున్న శ్రోతల సంఖ్యతో ఆ పరిసరాలు అత్యంత రమణీయంగా మారిపోయాయి. స్వామి నేల మీద కూర్చుని ఉపన్యసిస్తుంటే, అదిచూసి శ్రోతలంతా నేలమీదే కూర్చోవడం ప్రారంభించారు. చోటుసరిపోక కొందరు మెట్లమీద కూర్చునేవారు. ఆ గంభీరస్వరం పాఠాలు చెబుతుంటే, స్వామి పలికే ప్రతివచనము శ్రోతలు, తమసౌకర్యాల గురించి పట్టించు కోకుండా, శ్రద్ధగా వినేవారు. '
' స్వామి శ్రోతల ప్రశంశలు పట్టించుకునేవారు కాదు. రాజయోగ రహస్యాలను స్వామి శ్రోతలకు ప్రతిరోజూ బోధించేవారు. శ్రోతలు విషయంమీద పట్టు సాధించాలనే తపనతో స్వామి యెప్పుడూ వుండేవారు గానీ, వారు తనను ఏ విధంగా పొగుడుతున్నారా, అనే దానిమీద స్వామికి ధ్యాస ఎంతమాత్రమూ వుండేదికాదు. '
ఆ సమయంలో భారతదేశం నుండి శిష్యులు తిరిగి రమ్మని కోరుకుంటూ లేఖలు వ్రాయసాగారు. దానికి స్వామి, వారిని, ' స్వశక్తి మీద ఆధారపడి మీరు కన్నతల్లి ఋణం తీర్చుకోవడానికి, ప్రచండ దీక్షతో సాహసంతో కార్యరంగం లోకి వురకండి. మనమిప్పుడు కేవలం భారతదేశాన్నే కాక, ప్రపంచాన్నంతా సనాతన ధర్మం గుర్తించమని మేల్కొలపవలసి వున్నది. ' అని వ్రాసేవారు. అనేక విషయాలమీద స్వామి భారతదేశ యువకులను ఉత్సాహ పరుస్తూ అమెరికా నుండి వ్రాసిన లేఖలు, భారతదేశ యువతలో మహోత్సాహాన్ని కలిగించి, వారి చేత ' బ్రహ్మవాదిని ' అనే పత్రిక స్థాపించేలా చేసింది. అచిరకాలంలో ఆ పత్రిక దేశం అన్నిమూలలా స్వామి భావ వీచికలు వెదజల్లసాగింది.
ఇక అమెరికాలోని శిష్యులకు స్వామి, స్వానుభవ నిదర్శన పూర్వకంగా, రాజయోగ, జ్ఞాన యోగాలను బోధిస్తూ వచ్చారు. ఆ బోధనలు, అక్కడి గొప్ప గొప్ప మానసిక తత్వవేత్తలు, పండితుల దృష్టిని, అనేక విషయాల మీద భారతీయ విజ్ఞానం వైపు మరల్చేలా చేసాయి. స్వామి వివేకానందపై వారి గురుభావం ఏ స్థితికి వెళ్లిందంటే, జేమ్స్ అనే మహాశయుడు తాను వ్రాసిన ఒక సుప్రసిద్ధ గ్రంధంలో స్వామిని ' వేదాంత శిరోభూషణం ' అని అభివర్ణించాడు. స్వయంగా స్వామిని తన ఇంటికి భోజనానికి పిలిచి ' గురువర్యా ' అని సంబోధించాడు.
అలా స్వామ్యిజైత్ర యాత్ర అమెరికా ఖండంలో సాగుతూ వున్నది.
స్వస్తి. .
వివేకానందుని జీవితస్పూర్తితో మరికొంత రేపు.
ప్రేమతో,
గండవరపు ప్రభాకర్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి