ఏది చదివినా.. మీరు డాక్టరే! | ఇంటర్‌ బైపీసీ తర్వాత?మెడికల్‌ కోర్సులు

డాక్టర్‌ కావాలంటే  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ చదవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే.  కానీ ఆయుష్‌ కోర్సులు చేసినా డాక్టర్‌ అయిపోవచ్చు. వీటికీ నీట్‌ ద్వారానే ప్రవేశాలు లభిస్తాయి.  ఆయుష్‌ విభాగాలైన ఆయుర్వేదం, యునానీ, హోమియో, నేచురోపతి, సిద్ధ వైద్యాలు ఇప్పుడు అలోపతికి దీటుగా ప్రాచుర్యం పొందుతున్నాయి.  ప్రతి ఒక్కదానికీ ప్రత్యేకమైన విధానం ఉంది. అందరికీ ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. ఇంటర్మీడియట్‌ను బైపీసీ గ్రూప్‌తో పూర్తిచేసిన అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఈ కోర్సులనూ ఎంచుకోవచ్చు.
వైద్యవిద్య వైపు సాగే లక్ష్యంతోనే చాలామంది ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూప్‌ తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ, గౌరవం, ఆదాయం ఉన్నవాటిల్లో వైద్యవృత్తి ప్రధానమైనది. అందుకే వైద్యవిద్యకు పోటీ ఎక్కువ. వ్యయమూ అధికమే. ఇంటర్మీడియట్‌లో చేరినప్పటి నుంచే  ప్రవేశ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా పరిశ్రమిస్తుంటారు.
వైద్యవిద్యలో ప్రధానమైన కోర్సులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌. ఎక్కువమంది వీటిపైనే దృష్టిపెడతారు. కానీ ఆధునిక వైద్యంతో పోటీపడుతూ ఎన్నో ఇతర వైద్య కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటినీ పరిశీలించవచ్చు. వీటన్నింటికీ నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ద్వారానే ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దీన్ని నిర్వహిస్తోంది.
సాధారణంగా వైద్య విద్యను ప్రధాన, ఆయుష్‌ కోర్సులుగా విభజించవచ్చు. ప్రధాన కోర్సుల్లో ఇంగ్లిష్‌/ ఆధునిక వైద్యంగా పేర్కొనే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉంటాయి. ఆయుష్‌ కోర్సుల్లో సంప్రదాయ/ ప్రకృతిసిద్ధమైన ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతికి సంబంధించినవి ఉంటాయి.

ఏది చదివినా.. మీరు డాక్టరే!

ఈ ఏడాది నుంచి ఎయిమ్స్‌, జిప్‌మర్‌లు నిర్వహించుకునే ప్రత్యేక ప్రవేశ పరీక్షలను రద్దు చేశారు. ఎయిమ్స్‌ల్లోని 1207 సీట్లనూ, జిప్‌మర్‌ల్లోని 200 సీట్లనూ నీట్‌ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు.

ప్రధాన కోర్సులు

ఏది చదివినా.. మీరు డాక్టరే!

ఎంబీబీఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ. ప్రతిష్ఠాత్మక కోర్సు. డాక్టర్‌ వృత్తిని చేపట్టాలనుకునేవారు ఎంచుకునే ప్రధాన డిగ్రీ. రెండు ప్రొఫెషనల్‌ డిగ్రీలు- మెడిసిన్‌, సర్జరీల కలయిక ఇది. దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు దీనిని అందిస్తున్నాయి. నాలుగున్నరేళ్ల కోర్సులో బేసిక్‌, ప్రి, పారామెడికల్‌ సబ్జెక్టులను చదువుతారు. ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అనాటమీ, ఫార్మకాలజీ, పాథాలజీ వీటిలో భాగం. ఏడాది తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. నీట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు.
బీడీఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ. ఇది దంత వైద్యానికి సంబంధించింది.  ఎంబీబీఎస్‌ తర్వాత ఎక్కువమంది ఆసక్తి చూపే కోర్సు. గతంతో పోలిస్తే ఇటీవలి సంవత్సరాల్లో దీనికీ ఆదరణ బాగా పెరిగింది. డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఆధ్వర్యంలో కోర్సును నిర్వహిస్తారు. దీనిని పూర్తిచేసినవారు ప్రాక్టీసింగ్‌ డెంటిస్ట్‌ లేదా డెంటల్‌ సర్జన్‌ కావచ్చు. కోర్సు కాలవ్యవధి అయిదేళ్లు. దీనిలో ఏడాది తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌ భాగం. 26,949 బీడీఎస్‌ సీట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.

ఆయుష్‌ విభాగాలు

ఏది చదివినా.. మీరు డాక్టరే!

వీటిని సంప్రదాయ లేదా ప్రత్యామ్నాయ వైద్య కోర్సులుగా చెబుతారు. ఆధునిక వైద్యానికి భిన్నంగా ప్రకృతిసిద్ధమైన చికిత్సతో వ్యాధులను నయం చేయడం వీటిల్లో కనిపిస్తుంటుంది. సహజంగా శరీరమే తనను తాను నయం చేసుకునే విధంగా చేయడం (నేచురల్‌ హీలింగ్‌) ఈ చికిత్స విధానాల్లో కనిపిస్తుంది. కానీ ఉపయోగించే పద్ధతుల్లోనే తేడా ఉంటుంది. నీట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సుల కాలవ్యవధి అయిదేళ్లు అందులో ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.
* ఆయుర్వేదం- బీఏఎంఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. ఆయుర్వేద వైద్యానికి సంబంధించింది. మనదేశంతోపాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, సౌత్‌ ఏషియన్‌ దేశాల్లో ఈ వైద్యానికి ఆదరణ ఎక్కువ. ఆయుర్వేద తత్వశాస్త్రం పంచభూతాల సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. దీనిని పురాతన వైద్యవిధానంగానూ చెబుతారు. ఈ విధానంలో వ్యాధిని నయం చేయడమే కాకుండా నివారణ, భవిష్యత్తులో వచ్చే అవకాశాలనూ నియంత్రించడం ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. మూలికలు, వాటితో చేసిన మందుల ద్వారా వ్యాధులను   నివారిస్తారు. మొత్తంగా ప్రకృతి సిద్ధమైనవి, జీవన విధానాల్ని మార్చుకోవడం ద్వారా శరీరం తనను తాను నయం చేసుకునే పద్ధతులను ఇందులో నేర్పిస్తారు.
కోర్సు ఏడాదిన్నర చొప్పున మూడు విభాగాలుగా విభజితమై ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ, ఆయుర్వేదిక్‌ ఫార్మస్యూటికల్‌ సైన్స్‌, టాక్సికాలజీ, ఫార్మకాలజీ, సర్జరీ, ఈఎన్‌టీ, స్కిన్‌, గైనకాలజీ మొదలైన అంశాలను కోర్సులో భాగంగా చదువుతారు. కోర్సు అనంతరం జనరల్‌ ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు లేదా ఎండీ ఆయుర్వేద చదవవచ్చు. ప్రాక్టీసు పెట్టాలనుకునేవారు ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందాలి.

ఏది చదివినా.. మీరు డాక్టరే!

* హోమియో- బీహెచ్‌ఎంఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. హోమియోపతిక్‌ వైద్య పరిజ్ఞాన విభాగం ఇది. అలోపతి, ఆయుర్వేదం తర్వాత దేశంలో మూడో ప్రసిద్ధ వైద్య విధానం. దేహంపై దుష్ప్రభావాలు చూపకుండా ఉండే ద్రవ, టాబ్లెట్‌ రూపంలో మందులను అందిస్తారు. వీటిని సాధారణంగా మొక్కలు, జంతువులు, మినరల్స్‌ నుంచి తయారు చేస్తారు. దేహంలో సహజసిద్ధ స్వస్థత వృద్ధి అయ్యేలా చేస్తారు.
కోర్సులో నాలుగు విభాగాలుంటాయి. మొదటిది ఏడాదిన్నర, మిగతా మూడు ఏడాది చొప్పున ఉంటాయి. హెర్బాలజీ, నేచురల్‌ థెరపీలు, హోమియోపతిక్‌ పద్ధతులు, హీలింగ్‌ టెక్నిక్‌లు మొదలైనవాటిని కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. ఫార్మసీ, పీడియాట్రిక్స్‌, సైకియాట్రీ, స్కిన్‌ స్పెషలిస్ట్‌, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ స్పెషలైజేషన్లుంటాయి. వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వీలుంటుంది. కోర్సు అనంతరం ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు లేదా అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లలో పీజీ అయినా చేసుకునే వీలుంది.


ఏది చదివినా.. మీరు డాక్టరే!

* యునానీ- బీయూఎంఎస్‌:  బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. పురాతన వైద్యవిధానాల్లో ఒకటి. దేశంలో నాలుగో ప్రసిద్ధ వైద్య విధానం. దక్షిణ ఆసియా, అరబ్‌ దేశాలు ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నాయి. దీనినే హిక్‌మత్‌, యునానీ టిబ్‌ మెడిసిన్‌గానూ వ్యవహరిస్తారు. దీనిలో సానుకూల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, వాటి జ్ఞానం, అభ్యాసాలు ఉంటాయి. మూలికలను వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. వ్యాధి నిర్ధారణ అంశాలు- వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, లెబోరేటరీ సదుపాయాలు, వాటిని ఉపయోగించే విధానం వంటి అంశాలను నేర్చుకుంటారు. దీనిని చదవాలనుకునేవారికి ఉర్దూ తెలిసుండటం తప్పనిసరి. కోర్సు పూర్తిచేసినవారిని హకీమ్‌లుగా వ్యవహరిస్తారు. ఉన్నత చదువులు చదవాలనుకునేవారికి డిప్లొమా, పీజీ, డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఏది చదివినా.. మీరు డాక్టరే!


* నేచురోపతి- బీఎన్‌వైఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌. నేచురోపతిక్‌ మెడిసిన్‌, థెరపిక్‌ యోగాల సమ్మిళితం. దీనిలో మందుల ప్రసక్తి లేకుండా వ్యాధులు రాకుండా/ నయం చేయడంపై దృష్టిసారిస్తారు. కోర్సులో భాగంగా నేచురోపతి, యోగా అంశాలను నేర్చుకుంటారు. నేచురోపతిలో డైట్‌, మసాజ్‌, ఎక్సర్‌సైజ్‌, న్యూట్రిషన్‌ థెరపీ, ఆక్యుపంక్చర్‌, ఆక్యుప్రెజర్‌, నాచురల్‌ చైల్డ్‌బర్త్‌, హెర్బల్‌/ బొటానికల్‌ మెడిసిన్‌ మొదలైన వాటిని బోధిస్తారు. యోగాలో శ్వాస నియంత్రణ, మెడిటేషన్‌, ఆసనాలపై దృష్టిపెడతారు. రోగి సమస్య ఆధారంగా ఈ అంశాల నుంచి అవసరమైన ప్రత్యేకమైన చికిత్సా పద్ధతిని రూపొందిస్తారు. కోర్సు పూర్తిచేసినవారు సొంతంగా జనరల్‌ ప్రాక్టీషనర్‌ కావచ్చు. వీరికి మెడికల్‌ విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్‌ అవకాశాలూ ఉంటాయి. స్పెషలైజేషన్‌తో పీజీ చేసుకునే వీలూ ఉంది.

ఏది చదివినా.. మీరు డాక్టరే!


సిద్ధ వైద్యం- బీఎస్‌ఎంఎస్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ సిద్ధ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ఆయుష్‌ విభాగాల ఆధ్వర్యంలో నడిచే సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం)   ఈ కోర్సును నిర్వహిస్తోంది. ఈ వైద్య విధానం తమిళుల నుంచి ఇతరులకు చేరినట్లుగా చెబుతారు. ఇందులో శరీరానికే కాదు మానసిక స్థితికీ ప్రాధాన్యమిస్తారు. సిద్ధ తాత్వికత ప్రకారం- మానవ శరీరంలోని ఏడు అంశాలు (ప్లాస్మా, రక్తం, ఎముకలు, ఫ్యాట్‌, కండరాలు, రక్తనాళాలు, సీమన్‌) వాత (గాలి), పిత్త (ఉష్ణం/ శక్తి), కఫ (వాటర్‌) అధీనంలో ఉంటాయి. ఈ మూడింటిలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా వ్యాధులు వస్తాయి. అందుకే చికిత్సలో భాగంగా రోగి, పర్యావరణం, వయసు, అలవాట్లు, శారీరక స్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. కోర్సు అనంతరం డాక్టర్‌గా స్థిరపడవచ్చు లేదా సంబంధిత వైద్య కళాశాలల్లో బోధన చేయవచ్చు. ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్‌తో ఎండీ కోర్సులో చేరవచ్చు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)