ఇంటర్ లేకుండా ఎల్‌ఎల్‌బీ చేయవచ్చా? | ఫోరెన్సిక్ కోర్సులు ఎక్కడున్నాయ్?
🔳ఇంటర్ లేకుండా ఎల్‌ఎల్‌బీ చేయవచ్చా?
ఇంటర్ లేకుండా ఎల్‌ఎల్‌బీ చేయవచ్చా?
* ఇంటర్మీడియట్ చదవకుండా బీఏ దూరవిద్య ద్వారా పూర్తిచేశాను. ఎల్‌ఎల్‌బీ చేయాలనుకుంటున్నాను. వీలవుతుందా?
- జ్యోతి కుమారి
* బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పదో తరగతి, ఇంటర్ (పన్నెండో తరగతి) తర్వాత కనీసం మూడు సంవత్సరాల డిగ్రీ చదివినవారే ఎల్‌ఎల్‌బీ కోర్సు చేయడానికి అర్హులు. ఈ నిబంధనని అనుసరించే వివిధ రాష్ట్రాలు తాము నిర్వహించే ప్రవేశపరీక్షలో 10+2+3 విధానంలో డిగ్రీ పొంది ఉండాలని అర్హతని నిర్ణయిస్తున్నాయి. ఇంటర్ చదవకుండా డిగ్రీ చదివారు కాబట్టి, ఎల్‌ఎల్‌బీలో చేరేందుకు నిర్వహించే ప్రవేశపరీక్షకు మీరు అర్హులు కారు.
Ad
ఫోరెన్సిక్ కోర్సులు ఎక్కడున్నాయ్?
* మా అమ్మాయి ఇంటర్ పూర్తిచేసింది. ఫోరెన్సిక్ సైన్స్ చదవాలనుకుంటోంది. అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగావకాశాలేంటి?
Ad
- మురళీధర్
* మనదేశంలో ఫోరెన్సిక్ సైన్స్‌కు సంబంధించి గ్రాడ్యుయేట్ స్థాయిలో బీఎస్సీ (ఫోరెన్సిక్ సైన్స్), బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ బ్రాంచి బైపీసీలో 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండడం ఈ కోర్సులకు కనీస అర్హత. ఇందులో నిలదొక్కుకోవాలంటే సూక్ష్మ పరిశీలన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు చాలా అవసరం. ఈ కోర్సును మనదేశంలో పంజాబ్ యూనివర్సిటీ, ముంబయి యూనివర్సిటీ, కర్ణాటక యూనివర్సిటీ, మైసూరు యూనివర్సిటీ, నాగపూర్ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, మద్రాసు యూనివర్సిటీ, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలతో పాటు మరి కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలూ అందిస్తున్నాయి.
ఫోరెన్సిక్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసినవారు ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్స్, క్రైమ్ రిపోర్టర్, హ్యాండ్ రైటింగ్ ఎక్స్‌పర్ట్, ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్, ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్ లాంటి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆర్థిక నేరాల దృష్ట్యా బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఆదాయపన్ను శాఖలు ఫోరెన్సిక్ సైన్స్‌కి సంబంధించిన విభాగాలను ప్రారంభించి ఫోరెన్సిక్ సైన్స్ చదివినవారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఫోరెన్సిక్ సైన్స్‌తో పాటు కంప్యూటరు సైన్స్‌లోనూ ప్రావీణ్యం ఉంటే సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు లభిస్తాయి.
Ad
- ప్రొ.బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సిలర్
కామెంట్‌లు