*మేనేజ్‌మెంట్ కోర్సులకు 85 వేలు, గరిష్ఠం 1.95 లక్షలు* *ప్రైవేటు కళాశాలల్లో కనీస, గరిష్ఠ ఫీజులపై నిపుణుల కమిటీ నివేదికకు కేంద్ర విద్యాశాఖ ఆమోదం*
*ఇంజనీరింగ్ కనీస ఫీజు*
*రూ.79,600✍️📚*
*గరిష్ఠ ఫీజు రూ.1.89 లక్షలుగా నిర్ణయం**🌻అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి*): దేశంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస ఫీజు రూ.79,600గా, గరిష్ఠ ఫీజు 1.89 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులకు ఉండాల్సిన కనీస, గరిష్ఠ ఫీజులపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర విద్యాశాఖ ఆమోదించింది. 2015లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులకు వ సూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించింది.
అయితే అప్పట్లో గరిష్ఠంగా ఇంతకుమించి వసూలు చేయకూడదని మాత్రమే నిబంధన పెట్టారు. కనీస ఫీజు ఎంత ఉండాలన్నదానిపై చెప్పలేదు. దీంతో పలు రాష్ట్రాల్లోని విద్యాశాఖలు దీనిపై తమకు తామే నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కళాశాల స్థాయి, మౌలిక సదుపాయాలను బట్టి ఏడాదికి రూ.30వేల నుంచి రూ.65వేల వరకు నిర్ణయించారు. తెలంగాణలో కూడా ఇలాగే చేశారు. అయితే కనీస ఫీజును కూడా నిర్ణయించాలంటూ కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించారు. కనీస, గరిష్ఠ ఫీజులు ఎంత నిర్ణయించవచ్చు అన్నదానిపై ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. తాజాగా ఆ కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర విద్యాశాఖ కూడా ఆమోదించింది. దీంతో ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ దత్తాత్రేయ సహస్రబుద్దే కొత్త ఫీజుల వివరాల గురించి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. కొత్తగా ఆమోదించిన నివేదిక ప్రకారం బీటెక్ విద్యార్థులకు ఏడాదికి కనిష్ఠ ఫీజు రూ.79,600, గరిష్ఠ ఫీజును రూ.1,89,800గా నిర్ణయించారు.
పీజీ కోర్సులకు కనిష్ఠంగా రూ.1,41,200, గరిష్ఠంగా రూ.3,04,000గా నిర్ణయించారు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులకు కనిష్ఠ ఫీజు రూ.67,900, గరిష్ఠ ఫీజు రూ.1,64,700గా నిర్ణయించారు. మేనేజ్‌మెంట్ కోర్సులకు ఏడాదికి రూ.85వేల నుంచి రూ.1,95,200 వరకు ఫీజులు ఉండవచ్చన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఫీజులు అమలు చేయాలని ఏఐసీటీ ఈ లేఖలో పేర్కొంది. అదేవిధంగా ఢిల్లీ హైకోర్టులో కూడా తాము కనిష్ఠ ఫీజు నిర్ణయించిన అంశాన్ని తెలుపుతూ ఒక అఫిడవిట్ వేస్తామని పేర్కొంది.
Gemini Internet
కామెంట్‌లు