గోవులను సంరక్షించాల్సిన బాధ్యత టిటిడి మీద కూడా ఉందని, ఇందులో భాగంగానే గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామని, భక్తులు, దాతలు ముందుకొస్తే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. డా. నరసింహారావు – బెస్తవారిపేట, ప్రకాశం
ప్రశ్న: ప్రతి జిల్లాలో గోశాల ఏర్పాటు చేసి వీధుల్లో గోవులకు నీడ కల్పించండి ?
ఈవో : ధర్మకర్తల మండలి ఈ విషయం ఆలోచిస్తోంది. టిటిడి పలమనేరులో ఇప్పటికే గోసంరక్షణశాల నిర్వహిస్తోంది. గోశాలలు ఏర్పాటు చేయడం కంటే వాటి నిర్వహణ కష్టం. వీటన్నింటినీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం.
2. రామకృష్ణ – కర్నూలు, శ్రీనివాస్ – కాకినాడ, అరుంధతి – హైదరాబాద్
ప్రశ్న: వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకలేదు. సర్వదర్శనంలో రావచ్చా?
ఈవో : తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్ల కోసం ప్రయత్నించండి.
3. కాళేశ్వరరావు – నెల్లూరు
ప్రశ్న: నాకు 70 ఏళ్లు. స్వామివారి దర్శనానికి రావాలని ఉంది. అనుమతిస్తారా?
ఈవో : 65 సంవత్సరాలు పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితి అయితే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని సొంత సమ్మతితో వస్తే దర్శనానికి అనుమతిస్తాం. వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఉండవు.
4. కల్యాణి – హైదరాబాద్
ప్రశ్న: అక్టోబరులో ఆన్‌లైన్ కల్యాణోత్సవం నిర్వహించాం. లడ్డూ ప్రసాదం అందలేదు?
ఈవో : ఆన్‌లైన్ కల్యాణోత్సవానికి లడ్డూ ప్రసాదం పంపడం లేదు.
5. వనజ – బెంగళూరు
ప్రశ్న: తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి పవిత్రత ఉంది. పది రోజులు తెరిచి ఉంచాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?
ఈవో : ఈ విషయంపై విస్తృత చర్చలు జరిపాం. కొందరు భక్తులు హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు 26 మంది మఠాధిపతులు, పీఠాధిపతులతో శాస్త్రాలపై కూలంకషంగా చర్చించి వారు ఆమోదించాకే వైకుంఠ ద్వారాన్ని పది రోజులు తెరవాలని నిర్ణయం తీసుకున్నాం.
6. కామేశ్వరి – విజయవాడ
ప్రశ్న: కోవిడ్-19 కారణంగా సీనియర్ సిటిజన్ అయిన నేను స్వామివారి దర్శనానికి రాలేకపోయాను. డోనార్ పాసుబుక్‌ల చెల్లుబాటు కాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలి?
ఈవో : అధికారులతో చర్చించి నిర్ణయం తెలుపుతాం.
7. అనురాధ – నాయుడుపేట
ప్రశ్న: నడకదారిలోని జింకలకు నీడ లేక ఫెన్సింగ్ దగ్గరికి వస్తున్నాయి. జింకలకు షెల్టర్, నీటి వసతి ఏర్పాటు చేయండి?
ఈవో : పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం.
8. దేవిక – బెంగళూరు
ప్రశ్న: నాకు మూడేళ్ల బిడ్డ ఉంది. స్వామివారి దర్శనానికి తీసుకురావచ్చా?
ఈవో : ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టడం మంచిది.
9. నర్సింహారావు – హైదరాబాద్
ప్రశ్న: నెఫ్ట్ ద్వారా 5,116/- విరాళం పంపాము. రసీదు రాలేదు?
ఈవో : పరిశీలించి రసీదు పంపుతాం.
10. శ్రీనివాస్ – మంచిర్యాల
ప్రశ్న: శ్రీవారి సేవలకు భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు?
ఈవో : ప‌్రస్తుతం సాధ్యం కాదు. చాలామంది నుంచి ఈ డిమాండ్ వస్తోంది. శీతాకాలం తరువాత ఒక నిర్ణయం తీసుకుంటాం.
11. వెంకటేశ్వరరావు – విజయవాడ
ప్రశ్న: ఎఎడి టికెట్లను పునరుద్ధరించాలి ?
ఈవో : ఈ దర్శనాన్ని చాలాకాలం క్రితమే నిలిపివేశాం.
12. ఆంజనేయులు – హైదరాబాద్
ప్రశ్న: నా వయసు 85 ఏళ్లు. నేను అన్నదానం ట్రస్టుకు విరాళం అందించాను. నా స్థానంలో నా కొడుకు కోడలిని దర్శనానికి అనుమతిస్తారా?
ఈవో : పరిశీలించి వివరాలు తెలియజేస్తాం.
13. ప్రేమ్ – చెన్నై
ప్రశ్న: తిరుమలలో లడ్డూ ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలి. భక్తిభావం పెంపొందించేలా తిరుమలలో హరినామ సంకీర్తనల బోర్డులు ఏర్పాటు చేయండి?
ఈవో : ప‌్రసాదాల పంపిణీకి క్లాత్ బ్యాగులు ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాం. భక్తిభావం పెంచేలా మరిన్ని బోర్డులు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాం.
14. శ్రీనివాసమూర్తి – హైదరాబాద్
ప్రశ్న: దాతల కుటుంబ సభ్యుల్లో 65 ఏళ్లు పైబడిన వారిని దర్శనానికి అనుమతిస్తారా?
ఈవో : అనుమతిస్తాం.
15. దినేష్ – విజయవాడ
ప్రశ్న: తిరుమలలో కొన్ని గదుల్లో వాటర్ హీటర్లు లేవు. భక్తులు వాటర్ హీటర్లు వెంట తీసుకొస్తే అలిపిరి టోల్‌గేట్ వద్ద అనుమతించడం లేదు?
ఈవో : తిరుమలలో అన్ని గదులను మరమ్మతులు చేసి వాటర్ హీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని విశ్రాంతి సముదాయాల్లో కామన్ హీట్ వాటర్ సదుపాయం ఉంది.
16. శ్రీదేవి – తిరుపతి
ప్రశ్న: ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్న సుందరకాండ, భగవద్గీత, విరాటపర్వం కార్యక్రమాలు బాగున్నాయి. ధనుర్మాసంలో భాగవత పారాయణం చేయించాలి. గీతాజయంతి రోజున హెచ్‌డిపిపి, అన్నమాచార్య ప్రాజెక్టులు ఈసారి ఆన్‌లైన్‌లో అయినా పిల్లలకు గీతాపఠనం పోటీలు నిర్వహించాలి?
ఈవో : భాగవత పఠనం గురించి ఆలోచిస్తున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. గీతాజయంతి రోజున భగవద్గీతలోని 700 శ్లోకాలు ఏకధాటిగా పఠించే ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకు ఆన్‌లైన్‌లో భగవద్గీత పోటీలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తాం.
17. లక్ష్మి – కాకినాడ
ప్రశ్న: తిరుమల మాడ వీధుల్లో వేసవిలో చెప్పులు లేకుండా నడిచేందుకు ఇబ్బందిగా ఉంది?
ఈవో : మాడ వీధుల్లో వైట్ పెయింట్ వేయించాం. కార్పెట్ ఏర్పాటు చేసి దానిపై తరచూ నీళ్లు చల్లడం జరుగుతోంది. ఇంకా మెరుగుపరిచే అవకాశాలను పరిశీలిస్తాం.
18. వెంకటేశ్వర్లు – నెల్లూరు
ప్రశ్న: గతంలో డిడి తీసి లేఖ పంపితే కల్యాణం టికెట్ పంపేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వీటిని పొందడం ఇబ్బందిగా ఉంది?
ఈవో : ప‌్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం మంచిది.
19. శ్రీనివాసాచార్యులు – హైదరాబాద్
ప్రశ్న: ఎస్వీబీసీలో విష్ణుసహస్రనామ పారాయణాన్ని మరో అరగంట పెంచి శ్లోక వివరణ ఇవ్వండి ?
ఈవో : పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.
20. రామచంద్ర – పుట్టపర్తి
ప్రశ్న: శ్రీవారి లడ్డూలు అందిస్తామని ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టాలి. ఊంజల్ సేవను ఉయ్యాల సేవగా పిలవాలి. ల‌్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చినపుడు గోవింద అని వచ్చేలా చూడండి?
ఈవో : భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల మీద టిటిడి ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. పోలీసు కేసులు నమోదు చేసి వెబ్‌సైట్లను బ్లాక్ చేయించింది. ఊంజల్ సేవ అనే పేరు పక్కన ఉయ్యాల సేవ అని పేరు పెడతాం. టిటిడి ఫోన్ ఎంగేజ్ వచ్చినపుడు గోవింద అని వచ్చే ఏర్పాటు చేస్తాం.
21. బాలాజి – విజయవాడ
ప్రశ్న: నవంబరు 3న ఆన్‌లైన్ కల్యాణం చేయించాం. ప్రసాదం రాలేదు?
ఈవో : ప‌్రసాదం పంపుతాం.
22. గుప్తా – శ్రీకాకుళం
ప్రశ్న: ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్‌లో ఇద్దరికి కాకుండా కుటుంబ సభ్యులు నలుగురికి అవకాశమివ్వండి?
ఈవో : ఎలా చేయగలమో పరిశీలిస్తాం.
23. నీరజ – చెన్నై
ప్రశ్న: ఎస్వీబీసీలో నాళాయిర దివ్యప్రబంధం చదివి తెలుగులో వివరణ చెప్పించండి?
ఈవో : పరిశీలిస్తాం.
*Dept.Of PRO TTD.*