9, జూన్ 2020, మంగళవారం

☝️అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి) | One Fee Structure in Degree Colleges


 రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో ఒకే తరహా ఫీజు విధానం అమల్లోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిద్ధమవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫీజుల్లో వ్యత్యాసం ఉండరాదన్న ఉద్దేశంతో కమిషన్‌ ఏకరూప ఫీజును నిర్ణయించాలని నిశ్చయించింది. మరో వారం రోజుల్లో కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియ పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,153 ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కాలేజీలు, 137 ఎయిడెడ్‌ కాలేజీలు, 151 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్‌, ప్రభుత్వ కాలేజీలకు కళాశాల విద్య కమిషనరేట్‌(సీసీఈ) ఫీజులను నిర్ణయిస్తుంది. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు మాత్రం తొలిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించనుంది. ఒకేతరహా ఫీజు ఎలా ఉండాలన్న దానిపై రెండు రకాలుగా ఆలోచనలు పరిశీలనలో ఉన్నాయని కమిషన్‌ సెక్రెటరీ ఎన్‌.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఒకటి.. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజును నిర్ణయించడం. రెండోది.. కాలేజీలను రెండు లేదా మూడు కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయించడమని చెప్పారు.

కామెంట్‌లు లేవు: