26, ఫిబ్రవరి 2023, ఆదివారం

*సీపీటీ ఉత్తీర్ణులైతేనే గ్రూప్‌-2, 3 నియామకాలకు అర్హత✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-2, 3 ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఇక నుంచి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష(సీపీటీ) ఉత్తీర్ణులైతేనే అర్హత సాధిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే సీపీటీ లేదంటే ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు, యూజీసీ గుర్తింపు పొందిన రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొంది. 100 మార్కులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారని.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 30, బీసీలకు 35, ఓసీలకు 40 చొప్పున కనీస ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు. పార్ట్‌-ఏ విభాగంలో కంప్యూటర్ల పరిచయం, సాఫ్ట్‌వేర్‌ రకాలు, ఆపరేటింగ్‌ విధానాలు, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌, వరల్డ్‌వైడ్‌ వెబ్‌ తదితర అంశాలపై 20 మార్కులకు.. పార్ట్‌ -బీలో ఆఫీస్‌ సూట్‌, ఆఫీస్‌ అప్లికేషన్లు, ఎంఎస్‌ వర్డ్‌, స్ప్రెడ్‌ షీట్‌, ప్రజంటేషన్‌ తదితర అంశాలకు సంబంధించి 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్‌-1 ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఈ నిబంధన వర్తించదని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: