19, అక్టోబర్ 2021, మంగళవారం

IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా


IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirumala Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం విజయవాడ నుంచి తిరుపతికి టూర్ (Vijayawada Tirupati Tour) ప్యాకేజీ ప్రకటించింది. కేవలం రూ.3,220 ధరకే ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.


తిరుమల వెళ్లాలనుకునే విజయవాడ పరిసర ప్రాంతా వాసులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్‌కు (IRCTC) చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరకే తిరుపతి టూర్ (Tirupati Tour) ప్యాకేజీ ప్రకటించింది. విజయ్ గోవిందం పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసిన పర్యాటకుల్ని రైలులో తిరుపతి తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. వీకెండ్‌లో రెండు రోజులు తిరుపతి టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.

ఐఆర్‌సీటీసీ విజయ్ గోవిందం ప్యాకేజీ ధర ఎంతంటే


ఐఆర్‌సీటీసీ టూరిజం విజయ్ గోవిందం టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,220 కాగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.3,300, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.3,920 చెల్లించాలి. కంఫర్ట్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,080 కాగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,160, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.5,780 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీ బుక్ చేసుకునేవారికి రైలులో స్టాండర్డ్ క్లాస్‌లో, కంఫర్ట్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి థర్డ్ ఏసీ క్లాస్‌లో బెర్త్ లభిస్తుంది.

రైలు టికెట్లతో పాటు ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. రైలులో భోజనం, ఐటినరీలో చెప్పిన స్థలాలు కాకుండా ఇతర ప్రాంతాలకు సైట్ సీయింగ్, వ్యక్తిగత ఖర్చులు, ఎంట్రెన్స్ టికెట్స్ లాంటివి ఈ టూర్ ప్యాకేజీలో కవర్ కావు. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు. పర్యాటకులు ఇదే వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేసుకోవాలి.

టూర్ సాగేది ఇలాగే...

మొదటి రోజు రాత్రి 10.50 గంటలకు విజయవాడలో 07209 నెంబర్ గల ఎక్స్‌ఫ్రెస్ రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు తిరుపతి చేరుకుంటారు. పర్యాటకులు తెనాలిలో కూడా రైలు ఎక్కొచ్చు. ఈ రైలు తెనాలికి రాత్రి 11.20 గంటలకు చేరుకుంటుంది. పర్యాటకుల్ని ఐఆర్‌సీటీసీ సిబ్బంది హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 8.50 గంటలకు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. సమయాన్ని బట్టి తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. రెండో రోజు రాత్రి 8.30 గంటలకు తిరుపతిలో రైలు ఎక్కితే మరుసటి రోజు తెల్లవారుజామున 2.10 గంటలకు తెనాలికి, 3.10 గంటలకు విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

కామెంట్‌లు లేవు: