Navy + Free B Tech
ఇంటర్ అర్హతతోనే ఉచితంగా బీటెక్ చేసే అవకాశంతోపాటు నేవీలో ఉద్యోగానికి వీలు కల్పిస్తోంది.. నేవీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం! ఇటీవల ఇండియన్ నేవీ.. పర్మనెంట్ కమిషన్(పీసీ) 10+2 క్యాడెట్(బీటెక్)ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. జేఈఈ మెయిన్ రాసిన అవివాహిత పురుష అభ్యర్థులు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులు.. వివిధ విభాగాల్లో ఉచిత ఇంజనీరింగ్ విద్యతోపాటు ప్రముఖ యూనివర్సిటీ జేఎన్‌యూ నుంచి పట్టాను పొందే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన హోదా, ఆకర్షణీయమైన వేతనాలు, అదనపు ప్రయోజనాలు, సుస్థిర జీవితాన్ని ఈ ఉద్యోగాలతో సొంతం చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 26(ఎడ్యుకేషన్ బ్రాంచ్-05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-21).
విద్యార్హతలు..
ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. అలాగే 10వ తరగతి లేదా 12వ తరగతి స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులను సాధించాలి. దీంతోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2020(బీఈ/ బీటెక్)లో అర్హత సాధించిన వారై ఉండాలి.
వయసు..
- దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 02 జనవరి 2002 నుంచి 01 జూలై 2004 మధ్య జన్మించినవారై ఉండాలి. వయసు 17 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎత్తు కనీసం 157 సెంటీ మీటర్లు ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ..
- జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
- షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మెయిల్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. వీరికిబెంగళూర్/భోపాల్/కోల్‌కత్తా/విశాఖపట్నంలలో మార్చి నుంచి జూన్ మధ్య ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ రెండు దశల్లో ఐదు రోజుల పాటు ఉంటుంది. స్టేజ్-1, స్టేజ్-2గా జరుపుతారు.
- స్టేజ్-1: ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ వంటివి అన్నీ ఈ విభాగంలో ఒకే రోజు నిర్వహిస్తారు.
- స్టేజ్-2: నాలుగు రోజులపాటు ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్టేజ్-1లో అర్హత సాధించిన వారిని మాత్రమే స్టేజ్-2కి పిలుస్తారు.
- స్టేజ్-2లో సైకాలజీ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రెండు దశల ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన అభ్యర్థులను తుది ఎంపిక చేసి.. మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన వారిని క్యాడేట్‌లుగా తీసుకొని..కేరళ రాష్ట్రం ఎజిమాలలోని నేవల్ అకాడమీలో నేవీ అవసరాలకు అనుగుణంగా నాలుగేళ్ల బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్) కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ).. బీటెక్ డిగ్రీని ప్రధానం చేస్తుంది. శిక్షణను పూర్తిచేసుకున్న వారిని నేవీ ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్(టెక్నికల్ బ్రాంచ్)లలో నియమిస్తారు.
కెరీర్ ప్రయోజనాలు..
- నేవీలో ప్రవేశం పొందిన వారికి సబ్ లెఫ్టినెంట్ నుంచి కమాండర్ వరకు పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది. అదే స్థాయిలో వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందుతాయి. ఇవేకాకుండా బేసిక్ ఇన్సూరెన్స్ కింద రూ.కోటి వరకు (కంట్రిబ్యూట్ చేసేదాన్ని బట్టి) పరిహారం పొందుతారు. పాలసీకి అనుగుణంగా గ్రాట్యుటీని కూడా అందిస్తారు. వార్షిక సెలవులు, సాధారణ సెలవులు లభిస్తాయి.
- ఆసక్తి కలిగిన వారికి రివర్ రాప్టింగ్, పర్వతారోహణ, హాట్ ఎయిర్ బెలునింగ్, హ్యాండ్ గ్లైడింగ్,విండ్ సర్ఫింగ్ వంటి సాహస క్రీడలను నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. ఆయా విభాగాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశాలను కల్పిస్తారు.
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సౌక ర్యాలతోపాటు కోర్సులో భాగంగా అవసరమయ్యే పుస్తకాలు,మెటీరియల్, దుస్తులను కూడా అందిస్తారు.
ముఖ్యమైన సమాచారం..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: 29.01.2021
- దరఖాస్తులకు చివరి తేదీ: 09.02.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
కామెంట్‌లు