యూట్యూబర్‌గా సక్సెస్ సాధించాలంటే...

యూట్యూబ్.. ప్రతిభను ప్రదర్శించేందుకు అంతర్జాతీయ వేదిక. ఇది కొంతమందిని రాత్రికిరాత్రే స్టార్లుగా మార్చేస్తోంది. మరికొంత మందికి ఊహించని ఆదాయం తెచ్చిపెడుతోంది. సృజనాత్మకతే పెట్టుబడిగా యూట్యూబర్‌గా మారి సంపాదించేందుకు వీలుకల్పిస్తోంది.
 ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, ఫిట్‌నెస్ మొదలైన విభాగాల్లో యువత ప్రతిభ చాటుతోంది. యూట్యూబర్‌గా సక్సెస్ సాధించి.. సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటున్నవారూ ఉన్నారు. సృజన, నవ్యత, నాణ్యత ఉంటే.. ఎవరైనా యూట్యూబర్‌గా మారొచ్చు. నేటి డిజిటల్ యుగంలో వినోదంతోపాటు ఆదాయ వనరుగా నిలుస్తున్న యూట్యూబర్ కెరీర్ గురించి తెలుసుకుందాం...
వైవా హర్ష, ఘాజీ దర్శకుడు సంకల్‌్నరెడ్డి, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి, మహా తల్లి (జాహ్నవి) వంటి వారెందరో యూట్యూబ్‌లో ప్రతిభను చాటడం ద్వారా.. బుల్లితెర, వెండితెరలపై తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. యూట్యూబ్‌ను ఆధారంగా చేసుకొని కొందరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంటే... మరికొందరు బాగా సంపాదిస్తున్నారు. వినూత్నంగా సాగే తమ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వగలిగే నేర్పు ఉంటే చాలు యూట్యూబ్ స్టార్‌గా ఎదగవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. మొబైల్ లేదా తక్కువ బడ్జెట్ కెమెరాలతో వీడియో షూట్ చేయొచ్చు. వీటిని గూగుల్ అకౌంట్ సహాయంతో యూట్యూబ్ చానల్ అకౌంట్ ఓపెన్‌చేసి, అప్‌లోడ్ చేయొచ్చు.

ఆదాయం ఎలా?
యూట్యూబ్ చానల్‌కు ప్రధాన ఆదాయ మార్గం.. ప్రకటనలు. వీటిద్వారా వచ్చే ఆదాయం ద్వారానే సదరు యూట్యూబ్ చానల్ యజమానికి చెల్లింపులు జరుగుతాయి. ఇటీవల యూట్యూబ్‌లో స్పామ్ కంటెంట్ పెరిగిందంటూ ఫిర్యాదులు, వీడియోలను వాయిస్‌ఓవర్‌తో తప్పుదోవ పట్టిస్తున్న సంఘటనలు ఎక్కువ అవడంతో గూగుల్ సంస్థ యూట్యూబ్ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో నవ్యత, నాణ్యతకు ప్రాధాన్యత పెరిగింది. వీటితోపాటు ఏడాది కాలంలో 4,000 గంటల వాచ్‌టైం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సైతం అమల్లోకి తెచ్చింది. కనీసం వెయ్యి మంది సబ్ స్క్రైబర్స్‌తో రోజుకు 10 గంటల వాచ్ టైం ఉంటేనే ఆదాయం పొందేందుకు వీలుంటుంది.

ముఖ్యమైన టూల్స్..
  • యూట్యూబ్ చానల్ ప్రారంభించడానికి పెట్టుబడి అవసరం లేకున్నా.. వీడియోలను కొన్ని టూల్స్ ద్వారా ఆకర్షణీయంగా రూపొందించవచ్చు. దాంతో వ్యూస్ పెంచుకోవడంతో పాటు సబ్‌స్క్రిప్షన్స్ కూడా పెరుగుతాయి.
  • చానల్ ప్రారంభించే ముందు మీరు ఎంచుకునే అంశంపై స్పష్టత ఉండాలి. దానికోసం కొంత పరిశోధన చేయాలి. వీక్షకులకు ఆసక్తి గలిగించే అంశాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. వీడియో రికార్డింగ్ కోసం 720పి రెజల్యూషన్ కంటే ఎక్కువ నాణ్యతతో రికార్డింగ్ చేస్తే మేలు. బడ్జెట్ అనుకూలిస్తే తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉండే కెనాన్ 1300డి వంటి బ్రాండెడ్ కెమెరాలు తీసుకొని వాటితో వీడియోలు చేయొచ్చు.
  • ట్రైపాడ్స్ తీసుకుంటే రికార్డింగ్ సులువు అవుతుంది. మార్కెట్‌లో తక్కువ పెట్టుబడితో ట్రైపాడ్స్ కొనుగోలు చేయొచ్చు.
  • మైక్రోఫోన్ ఆధారంగా చక్కటి ఆడియోతో పాటు వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది. ఇది ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ఉపయోగపడుతుంది.
  • బ్లూ స్క్రీన్ లేదా గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తే బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ సులువు అవుతుంది.
  • వీడియో రికార్డింగ్ చేసే క్రమంలో అవాంతరాలు రావడం సహజం. వాటిని డిలీట్ చేయడానికి ఎడిటింగ్ టూల్స్ ఉపయోగపడతాయి. వీడియో, ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి వీడియోను ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దొచ్చు. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ కోసం థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్‌లోనూ ఇన్ బిల్ట్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయని.. వాటిని ఉపయోగించుకుంటే కోరుకున్న ఔట్‌పుట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వ్యూస్ పెరిగేకొద్దీ...
యూట్యూబ్‌లో డబ్బులు రావాలంటే వ్యూస్ ఎక్కువగా రావాలి. అదేవిధంగా క్రమంతప్పకుండా వీడియోలు అప్‌లోడ్ చేయాలి. చానల్ ప్రారంభించిన మొదట్లోనే డబ్బులు రావు. మొదటి పేమెంట్ రావాలంటే.. బ్రేక్ ఈవెన్ అమౌంట్ (సుమారు 100 డాలర్లు) దాటాలి. తర్వాత రెగ్యులర్‌గా ఆదాయం అందుతుంది.
  • ఇండియాలో కంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీడియోలు చూస్తే సదరు చానల్ ఓనర్‌కు ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
  • వ్యూస్ పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. ప్రధానంగా టైటిల్స్ ఆకర్షించే విధంగా ఉండాలి. అదే విధంగా థంబ్‌నైల్స్ కూడా చూపరులను కట్టిపడేసేవిగా కనిపించాలి. తెలుగులో చానల్ ప్రారంభిస్తే .. తెలుగు భాషలోనే కీవర్డ్స్ ఇవ్వాలి. ఇక, యూట్యూబ్ నుంచి కూడా ఆటోమేటిక్/సజెస్టెడ్ కీవర్డ్స్ వస్తుంటాయి. వాటిని ఉపయోగిం చుకోవాలి. 'ఎంటర్‌టైన్‌మెంట్' విభాగాల వీడి యోలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఎడ్యుకేషన్ వంటి సంప్రదాయ విభాగాలు ట్రెండింగ్ వీడియోల్లో కనిపించట్లేదు.

వైరల్ అయితే కాసులే..!

 ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అయితే చాలు ఎంతో పేరు, డబ్బు వస్తుంది. వినోదాత్మక జానర్ ఎంచుకొని కొత్తగా వీడియోలు చేస్తే త్వరగా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా చానల్ పెట్టాలనుకుంటే.. ఫ్రెష్‌గా, ప్రొఫెషనల్‌గా తీయాలి. వాయిస్ ఓవర్, యాంకర్లను పెట్టి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లొచ్చు. అప్‌లోడ్ చేసే క్రమంలో కీవర్డ్స్ కూడా సరిపోయేవి ఇస్తే చానల్‌కు ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు. చానల్ ప్రమోషన్స్‌కు ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగించుకోవాలి. అందులోనూ చెల్లింపు ప్రమోషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా త్వరగా ప్రేక్షకులను చేరొచ్చు.
   - నల్లమోతు శ్రీధర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ చానల్.
 
 డేటా వినియోగం బాగా పెరిగింది...
 జియో వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో డేటా వినియోగం బాగా పెరిగింది. యూట్యూబ్ వీడియోలు బాగా చూస్తున్నారు. నేను అప్‌లోడ్ చేసే పోటీ పరీక్షల ఎడ్యుకేషన్ విభాగానికి సంబంధించిన వీడియోలకు ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటున్నారు. వారు మాత్రమే ఈ వీడియోలు చూస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ అంత సులువుగా డబ్బులు ఇవ్వడం లేదు. నిబంధనలు కఠినంగా ఉన్నాయి. నాకు మొదట ఆర్నెల్ల వరకు డబ్బులు రాలేదు. నేను ఫుల్‌టైం ఉద్యోగం చేస్తూ వీలున్నప్పుడు వీడియోలు చేస్తున్నాను. రెగ్యులర్‌గా వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి.
    
linkedin sharing button
facebook sharing button
twitter sharing button


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh