ఆర్టికల్ 243(డి) పంచాయితీ రిజర్వేషన్లు
• ఆర్టికల్ 243(డి3) ప్రకారం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ అయ్యే సీట్లలో కనీసం మూడో వంతు మహిలలకు కేటాయించాలి.
• ఆర్టికల్ 243(డి4) ప్రకారం గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా
పరిషత్ స్థాయులన్నింటిలో మొత్తం అధ్యక్ష స్థానాల్లో మూడో వంతు మహిళలకు
కేటాయించాలి.
• ఆర్టికల్ 243(డి5) ప్రకారం మహిళా రిజర్వేషన్లు మినహా అన్ని రిజర్వేషన్లు ఆర్టికల్ 334లో పేర్కొన్నంతకాలం కొనసాగుతాయి.
• ఆర్టికల్ 243(డి6) ప్రకారం పంచాయితీ రాజ్ సంస్థల్లో ఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను సంబంధిత రాష్ట్ర శాసనసభ నిర్దేశిస్తుంది.
• మహిళల రిజర్వేషన్లు: దేశవ్యాప్తంగా మొత్తం 20 రాష్ట్రాల పంచాయితీ
రాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. వీటిలో
మొదటగా బిహార్ రాష్ట్రంలో కల్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్,
పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్,జార్ఖండ్, కేరళ, అసోం, చత్తీస్‌గఢ్,
కర్ణాటక, ఒడిషా, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్,
మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు రాష్ట్రాల్లో
రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరో ఎనిమిది రాష్ట్రాలు హరియాణా, గోవా,
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఉత్తరప్రదేశ్,
మేఘాలయలో రిజర్వేషన్లు కల్పించడంలేదు.
ఆర్టికల్ 243(ఇ) పంచాయితీరాజ్ సంస్థల కాల పరిమితి
•
ఆర్టికల్ 243(ఇ1) ప్రకారం పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికల అనంతరం జరిగే
మొదటి సమావేశం నుంచి పంచాయితీల కాల పరిమితి అయిదేళ్లు. అయిదేళ్ల కాలం
ముగియక ముందే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయవచ్చు.
• ఆర్టికల్ 243(ఇ2) ప్రకారం పంచాయితీరాజ్ సంస్థల పదవీకాలం
అయిదేళ్లలో రాష్ట్ర శాసనసభ ఏదైనా చట్టాన్ని తీసుకొచ్చినపుడు దానిలో
పంచాయితీలకు సంబంధించిన అంశాలు ఉంటే అవి పంచాయితీ సంస్థల పదవీకాలం
పూర్తయ్యే వరకు వర్తించవు.
• ఆర్టికల్ 243(ఇ3) ప్రకారం పంచాయితీల పదవీకాలం అయిదేళ్లు ముగియక
ముందే రద్దయితే ఆర్నెల్లలోపు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. అయితే
సంస్థ (గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్) పదవీకాలం
ముగిసేందుకు ఆర్నెల్ల కంటే తక్కువ సమయం ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన
అవసరం లేదు.
• ఆర్టికల్ 243(ఇ4) ప్రకారం పదవీకాలం ముగియకమందే ఒక పంచాయితీ
రద్దయి నూతన పంచాయితీ ఉప ఎన్నిక ద్వారా ఏర్పడినపుడు అది మిగిలిన కాలానికి
మాత్రమే అధికారంలో ఉంటుంది.
ఆర్టికల్ 243(ఎఫ్) పంచాయితీ సభ్యుల అర్హతలు, అనర్హతలు
•
ఆర్టికల్ 243(ఎఫ్1) ప్రకారం రాష్ట్ర శాసనసభల చట్టం ద్వారా రాష్ట్ర
శాసనసభ ఎన్నికలకు సంబంధించి కానీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి
గానీ అనర్హులుగా ప్రకటించిన వ్యక్తులు పంచాయితీ సంస్థల ఎన్నికల పోటీకి
అనర్హులు.
• ఆర్టికల్ 243(ఎఫ్2) ప్రకారం ఒక పంచాయితీ సభ్యుడు పదవిలో
కొనసాగేందుకు అర్హుడా కాదా అన్న అంశం వివాదాస్పదమైనపుడు ఆ అంశాన్ని శాసన సభ
ఏర్పాటు చేసిన అఽథారిటీ నిర్ణయానికి పంపాలి. అర్హతలు/అనర్హతలను రాష్ట్ర
విధానసభ నిర్ధారించవచ్చు.
ఉదా: తెలుగు రాష్ట్రాల్లో 1995 తరవాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం
ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులు. అలాగే స్థానిక
సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస వయసు 21 ఏళ్లు.
ఆర్టికల్ 243(జి) పంచాయితీల అధికారాలు–విధులు
• భారత
రాజ్యాంగంలో పదకొండో షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలపై అధికారాలు, విధులను
పంచాయితీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాల్సి ఉంటుంది. అవి
వ్యవసాయం–వ్యవసాయ విస్తరణ, భూ అభివృద్ధి–భూ సంస్కరణల అమలు–భూ
స్థిరీకరణ–భూసారపు పరిరక్షణ, చిన్న నీటి పారుదల–నీటి నిర్వహణ–వాటర్ షెడ్‌ల
అభివృద్ధి, పశు సంవర్థకం–డెయిరీ–పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, సామాజిక
అడవులు–వ్యవసాయ క్షేత్ర అడవుల అభివృద్ధి, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు,
చిన్న తరహా పరిశ్రమలు–ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఖాదీ–గ్రామీణ–కుటీర
పరిశ్రమలు, గ్రామీణ గృహ వసతి, తాగునీరు, ఇంధనం–పశుగ్రాసం, రహదారులు–చిన్న
వంతెనలు–ఫెర్రీలు–జలమార్గాలు–ఇతరత్రా రాకపోకల విధానాలు, గ్రామీణ
విద్యుదీకరణ–విద్యుత్ పంపిణీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, పేదరిక నిర్మూలన
కార్యక్రమం, ప్రాథమిక–మాధ్యమిక పాఠశాల విద్య, సాంకేతిక శిక్షణ–వృత్తి
విద్య, వయోజన–అనియత విద్య, గ్రంథాలయాలు, సాంస్కృతిక కార్యకలాపాలు,
మార్కెట్‌లు–సంతలు, ఆసుపత్రులు–ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు–డిస్పెన్సరీలు
సహా ఆరోగ్యం–పారిశుధ్యం, కుటుంబ సంక్షేమం, మహిళ–శిశు అభివృద్ధి,
వికలాంగులు–మానసిక వికలాంగుల సంక్షేమం సహా సామాజిక సంక్షేమం, బలహీన వర్గాల
సంక్షేమం–ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సామాజిక ఆస్తుల
నిర్వహణ–పరిరక్షణ.
ఆర్టికల్ 243 (హెచ్) ఆదాయ వనరులు
• పంచాయితీరాజ్ సంస్థలకు
సమకూరే ఆదాయాలు: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు(స్థానిక సంస్థలకు సమకూరే
ప్రధాన ఆదాయ వనరు), కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, విరాళాలు, రాష్ట్ర
శాసనసభ నిర్దేశించిన మేరకు (చట్టం చేయడం ద్వారా) ఆర్టికల్ 265 ప్రకారం
విధించే పన్నులు.