8773 క్లర్కు కొలువులు

బ్యాంకు పరీక్షలు రాసే
అభ్యర్థులందరూ చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్
(క్లర్కులు) నోటిఫికేషన్ విడుదలైంది. గత రెండు సంవత్సరాలుగా 5 వేల ఖాళీలతో
నోటిఫికేషన్లు విడుదలవగా ఈసారి బ్యాక్‌లాగ్‌తో కలిపి 8773 ఖాళీలు భర్తీ
చేయబోతున్నారు. దీనిలో తెలంగాణలో 525, ఆంధ్రప్రదేశ్‌లో 50 పోస్టులున్నాయి.
డిగ్రీ అర్హత ఉన్నవారే కాకుండా డిసెంబరు 31 లోపు గ్రాడ్యుయేషన్
పూర్తిచేసుకోబోయే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!
రెండు అంచెల్లో
నిర్వహించే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక
చేస్తారు. తొలి అంచె.. ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష. దీంట్లో తగిన
మార్కులు సాధించి ఉత్తీర్ణులైనవారిలో ఖాళీల సంఖ్యకు 10 రెట్లమంది
మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. అభ్యర్థులు మెయిన్స్‌లో సాధించిన మార్కుల
ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
సెక్షనల్వారీ కటాఫ్ లేదు
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రెండిట్లోనూ సెక్షనల్ కటాఫ్ మార్కులు
లేవు. అంటే అభ్యర్థులు కనీస మార్కులతో సెక్షన్లవారీగా అర్హత సాధించాల్సిన
అవసరం లేదు. మొత్తం పరీక్షలో కనీస మార్కుల కటాఫ్ ఉంటుంది. అయితే
సెక్షన్లవారీగా సమయ విభజన ఉంటుంది. పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ
కొన్ని విభాగాల్లో కనీస మార్కులు లేక ఉత్తీర్ణులు కాలేకపోయిన సందర్భాలు
ఇతర బ్యాంకు పరీక్షల్లో ఉన్నాయి. కాబట్టి ఇది అభ్యర్థులకు చాలా ఊరటనిచ్చే
విషయం.
లాంగ్వేజ్ టెస్ట్
జూనియర్ అసోసియేట్స్ ఖాళీలను రాష్ట్రాలవారీగా భర్తీ చేస్తారు. కాబట్టి
అభ్యర్థులకు తాము దరఖాస్తు చేసే రాష్ట్రంలోని అధికార భాషలో పట్టు ఉండాలి.
అందుకే ఎంపికైనవారికి నియామకానికి ముందుగా భాషా ప్రావీణ్య పరీక్ష
(లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్) నిర్వహిస్తారు. దీనిలో అర్హత
సాధించినవారినే ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులు తమ పదో తరగతి లేదా
ఇంటర్మీడియట్లో ఆ భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లయితే వారికి ఈ భాషా
పరీక్ష అవసరం ఉండదు.
ఎన్ని విభాగాలు?
ప్రిలిమినరీ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్,
న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. మెయిన్స్ పరీక్షలో నాలుగు
విభాగాలు. జనరల్ ఇంగ్లిష్, జనరల్/ఫైనాన్స్ అవేర్నెస్, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్.
ఆయా విభాగాలను వివిధ పేర్లతో వ్యవహరించినా.. పరీక్షలో ప్రశ్నలు వచ్చే
విధానాన్ని అనుసరించి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో మొత్తంగా నాలుగు
విభాగాలని చెప్పొచ్చు. అవి- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్,
ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్. వీటి నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్
పరీక్షల్లో గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించి సన్నద్ధం
కావాలి. గతంలో జరిగిన పరీక్షలను బట్టి వివిధ సబ్జెక్టుల్లో ఏయే టాపిక్స్
నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో గమనిద్దాం.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
సింప్లిఫికేషన్స్ 10-15 ప్రశ్నలు- ప్రిలిమ్స్/5 - మెయిన్స్),
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ (5-6 ప్రిలిమ్స్/ 2-3 మెయిన్స్), క్వాంటిటీ
కంపేరిజన్ (3-4 ప్రిలిమ్స్/మెయిన్స్), నంబర్ సిరీస్ (5 ప్రిలిమ్స్/
2-3-మెయిన్స్), డేటా సఫిషియన్సీ (4-5 మ్రెయిన్స్), డేటా ఇంటర్‌ప్రెటేషన్
(5-10 ప్రశ్నలు ప్రిలిమ్స్/ 20-25 ప్రశ్నలు మెయిన్స్), అరిథ్‌మెటిక్
ప్రశ్నలు (10-12 ప్రిలిమ్స్/మెయిన్స్). అరిథ్‌మెటిక్‌లో అన్ని టాపిక్స్
బాగా చూసుకోవాలి. ఉదాహరణకు పర్సంటేజ్, యావరేజ్, రేషియో- ప్రపోర్షన్,
పార్టనర్షిప్, ఏజెస్, ప్రాఫిట్-లాస్, డిస్కౌంట్, టైమ్-వర్క్,
టైమ్-డిస్టెన్స్, ఎలిగేషన్, మెన్సురేషన్, పర్ముటేషన్-కాంబినేషన్,
ప్రాబబిలిటీ మొదలైనవి.
రీజనింగ్: సీటింగ్
అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ (18-20 ప్రశ్నలు ప్రిలిమ్స్/మెయిన్స్),
ఇన్‌ఈక్వాలిటీ (3-5 ప్రిలిమ్స్), సిలాజిజమ్స్ (3-5
ప్రిలిమ్స్/మెయిన్స్), కోడింగ్-డీకోడింగ్ (4-5 ప్రిలిమ్స్/మెయిన్స్),
బ్లడ్ రిలేషన్స్ (3-5 ప్రి/మె), ఆల్ఫా-న్యూమరికల్ సిరీస్ (3-5
ప్రి/మె), డైరెక్షన్స్ (2-3 ప్రిలిమ్స్), వర్డ్బేస్డ్ ప్రశ్నలు (2-3
ప్రి/మె), డేటా సఫిషియన్సీ (3-5 మెయిన్స్), ఇన్పుట్-అవుట్‌పుట్ (5-6
మెయిన్స్), లాజికల్ రీజనింగ్ స్టేట్మెంట్ సంబంధ ప్రశ్నలు (5-10
మెయిన్స్) మొదలైనవి..
ఇంగ్లిష్:
ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిట్లో గ్రామర్ ఆధారిత ప్రశ్నలు/ రీడింగ్
కాంప్రహెన్షన్ ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ (7-10 ప్రి/మె),
సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, ఫ్రేజల్ రీ అరేంజ్మెంట్, పేరా జంబుల్,
కరెక్ట్ సెంటెన్స్ ఫైండింగ్, క్లోజ్ టెస్ట్, మిస్ స్పెల్ట్,
ఫిల్లర్స్, వర్డ్ స్వాప్, వర్డ్ యూసేజ్ మొదలైన గ్రామర్ ఆధారిత
ప్రశ్నలు ఒక్కో మోడల్ నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిట్లో 4-5
ప్రశ్నలు వస్తాయి.
జనరల్ అవేర్నెస్: దీనిలో
బ్యాంకింగ్, ఆర్థిక అంశాల ప్రాధాన్యంగా గత 6-8 నెలల తాజా పరిణామాలపై
ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటు వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు,
జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, క్రీడలు,
సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ మొదలైనవాటి నుంచి కూడా ప్రశ్నలు
అడుగుతారు.
సన్నద్ధత ఉమ్మడిగానే!
ప్రిలిమ్, మెయిన్స్ పరీక్షలకు కలిపి ఉమ్మడిగానే ప్రిపరేషన్ ఉండాలి.
మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగే
టాపిక్స్ అన్నింటినీ త్వరగా నేర్చుకోవాలి. ఎక్కువ ప్రశ్నలు.. తక్కువ
ప్రశ్నలు వచ్చే టాపిక్స్ గమనించి ప్రాధాన్య క్రమంలో పూర్తిచేసుకోవాలి.
- టాపిక్స్ పూర్తయ్యాక వాటిలోని వివిధ మోడల్ ప్రశ్నలను బాగా సాధన
చేయాలి. ఆపై సమయాన్ని నిర్దేశించుకుని టాపిక్‌లవారీగా టెస్టులు రాయాలి.
అప్పుడే నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో అవగాహన
ఏర్పడుతుంది. ఆయా ప్రశ్నల సంఖ్యను పెంచుకునేలా వేగంగా సాధించగలిగే మెలకువలు
నేర్చుకోవాలి.
- టాపిక్స్ అన్నీ పూర్తయ్యేవరకూ వేచి చూడకుండా ప్రారంభం నుంచే
ప్రతిరోజూ పరీక్ష తరహాలోని మోడల్ పేపర్‌ను ఆన్లైన్ పద్ధతిలో రాయాలి.
దీనవల్ల పరీక్ష విధానానికి అలవాటుపడతారు. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు
సాధించగలుగుతున్నారో తెలుస్తుంది.
- రోజుకు 10-12 గంటలు సమయం తగ్గకుండా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే ఈ విభాగాలన్నింటినీ పూర్తిచేసుకునే సమయం ఉంటుంది.
- సబ్జెక్టుల ప్రాధాన్యం/ కఠినత్వాల ఆధారంగా రోజులో వాటికి సమయాన్ని
కేటాయించాలి. సాధారణంగా వీటి ఆధారంగా అప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్,
జనరల్ అవేర్నెస్ విభాగాలకు 4:3:2:1 నిష్పత్తిలో సమయాన్ని కేటాయిస్తే
బాగుంటుంది.
అప్రెంటిస్ అభ్యర్థులకు అదనపు మార్కులు
ఎస్బీఐలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తిచేసుకుని 31.10.2023 నాటికి
సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలోని మొత్తం మార్కుల్లో
2.5 శాతం.. అంటే 5 మార్కులను వారు పొందిన మార్కులకు అదనంగా కలుపుతారు.
దీనివల్ల వారికి ఎంపికలో అదనపు ప్రయోజనం కలుగుతుంది.


జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ మూలవేతనం రూ.19900 ఉంటుంది. డీఏ, ఇతర
అలవెన్సులతో కలిపి ముంబయి లాంటి నగరంలో నెలకు దాదాపు రూ.37,000 వేతనం
లభిస్తుంది. ఇది వారు పనిచేసే ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఇవి కాకుండా
మెడికల్, లీవ్ఫేర్ మొదలైన అదనపు సదుపాయాలుంటాయి. ప్రావిడెంట్ ఫండ్,
నూతన పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ సదుపాయం కూడా అందిస్తారు.
కెరియర్- పదోన్నతులు
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి చక్కటి
అవకాశాలుంటాయి. ఈ బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు
రాయడం, అంకితభావంతో కష్టపడి పనిచేయడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.
జూనియర్ అసోసియేట్‌గా నియమితులైన అభ్యర్థులు అంచెలంచెలుగా ట్రైనీ ఆఫీసర్
(స్కేల్-1), డిప్యూటీ మేనేజర్ (స్కేల్-2), మేనేజర్ (స్కేల్-3), చీఫ్
మేనేజర్ (స్కేల్-4), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (స్కేల్-5), డిప్యూటీ
జనరల్ మేనేజర్ (స్కేల్-6), జనరల్ మేనేజర్ (స్కేల్-7) వరకు చేరుకునే
అవకాశాలుంటాయి.