డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు
తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో '' బాలాలయ మహాసంప్రోక్షణ ''
తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయంలో డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు ''బాలాలయ మహాసంప్రోక్షణ'' కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది.
ఈ కార్యక్రమానికి డిసెంబరు 5వ తేదీ రాత్రి అంకురార్పణం జరుగనుంది.
ఆలయంలోని యాగశాలలో డిసెంబరు 6 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.
డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
____________________________________________________________________________________
తిరుమలలో పవిత్ర ఉద్యానవనాలు ఏర్పాటు - టిటిడి ఈవో
• 10 ఎకరాల్లో వరాహ పురాణం మొక్కులు
• 20 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్
• జిఎన్సి టోల్ గేట్ వద్ద 5 ఎకరాల్లో ఉద్యానవనం
భూలోక నందన వనంగా భాసిల్లుతున్న తిరుమలలో పురాణాలలో పేర్కొన్న విధంగా శ్రీవారి సేవకు వినియోగించే మొక్కలతో పవిత్ర ఉద్యానవనాలు త్వరలో ఏర్పాటు చేయునున్నట్లు ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.
తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఉద్యానవనాలను ఈవో, అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వరాహపురాణంలోని 38వ అధ్యాయంలో పేర్కొన్న విధంగా సప్తగిరులలోని శ్రీ వెంకటాచలంపై వెలసి ఉన్న స్వామివారు భక్తులకు కోరిన వరాలు ప్రసాదించే కల్పవృక్షంగా, కామధేనువుగా, చింతామణిగా భాసిలుతున్నట్లు పేర్కొనడం జరిగిందన్నారు.
10 ఎకరాల్లో వరాహ పురాణం మొక్కులు
వరాహపురాణంలో పేర్కొన్న విధంగా దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో పూల మొక్కలను పెంచనున్నట్లు తెలిపారు. ఇందులో ఏడు ఆకులు కలిగిన అరటి చెట్లు, తులసి, ఉసిరి, మోదుగ, జువ్వి, జమ్మి, దర్భ, సంపంగి, మామిడి, పారిజాతం, కదంబం, రావి, శ్రీగంథం, అడవి మల్లి, మొగలి, పున్నాగ, అశోక, పొగడ, యర్ర గన్నెరు, తెల్ల గన్నెరు ఉన్నాయి. వీటితో పాటు నాబి, మాదిఫల, బొట్టుగు, భాందిరా వంటి వృక్షాలను కూడా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలియజేశారు.
జిఎన్సి టోల్ గేట్ వద్ద 5 ఎకరాల్లో ఉద్యానవనం
తిరుమలలోని జిఎన్‌సి టోల్ గేట్ వద్ద గల గీతా ఉద్యానవనం, శ్రీ పద్మావతి వసతి సముదాయాల వద్ద ఐదు ఎకరాలను జిఎంఆర్ సహకారంతో టిటిడి ఉద్యానవన విభాగం, అటవీ విభాగం ఆధ్వర్యంలో అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.
20 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్
నారాయణగిరి ఉద్యానవనాలు, శిలాతోరణంను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా తిరుమల విద్యుత్ అవసరాలకు ధర్మగిరి అటవీ ప్రాంతంలో 20 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
--------------------------------------------------------------------------------------------------------------------
డిసెంబరు 8 నుండి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్, నాదస్వరం, డోలు, మృదంగం, ఘటం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ విభాగాలున్నాయి. బి.మ్యూజిక్, బి డ్యాన్స్, విశారద, ప్రవీణ కోర్సులున్నాయి.
ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్, డిప్లొమా రెగ్యులర్ కోర్సులతోపాటు సాయంత్రం కళాశాల పార్ట్‌టైమ్ కోర్సులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు.
రెగ్యులర్ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని కోర్సుల వారికి డిసెంబరు 28 నుండి 31వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించగలరు.
---------------------------------------------------------------------------------------------------------------------
కపిలతీర్థంలో సంకష్టహర గణేశ వ్రతం
కార్తీక మాస దీక్షల్లో భాగంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయ ప్రాంగణంలో శ్రీ సంకష్టహర గణేశ వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా పండితులు శ్రీ పవనకుమార శర్మ వ్రతం విశిష్టతను తెలియజేశారు. చతుర్థి తిథికి అధిపతి గణపతి అని, కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి నాడు ఈ వ్రతం నిర్వహించడం ఎంతో విశేషమని అన్నారు. వినాయకుడు సమస్తమైన ఆపదలు తొలగించి, కలియుగంలో శీఘ్రంగా ఫలాన్ని అనుగ్రహిస్తారని వివరించారు.
ముందుగా పార్వతి పరమేశ్వరులు, వినాయకుడి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. సంకల్పంతో వ్రతాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ వ్రతం ముగిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి