APPSC: నెలాఖరులోగా గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు
* డిగ్రీ, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, ఇతర పోస్టుల భర్తీకీ...
* మొత్తం 1,603 పోస్టులు
![]() |
ఈనాడు, అమరావతి:
ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను ఈ
నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
వెల్లడించింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ
చేయనున్నట్లు బుధవారం (నవంబర్ 1) విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గ్రూపు-1 కింద అదనంగా మరికొన్ని క్యారీ ఫార్వర్డ్ కేటగిరీ (నోటిఫికేషన్
జారీ చేసినప్పటికీ భర్తీ కానివి) పోస్టులు కలుస్తాయని పేర్కొంది. ‘గ్రూపు-1
పరీక్షలు, మూల్యాంకనానికి కొత్త విధానాన్ని రూపొందిస్తున్నాం. ఐఐటీ,
హెచ్‌సీయూ, రిక్రూటింగ్ ఏజెన్సీలు, మేధావులు, రాష్ట్రంలోని ఆంధ్రా,
నాగార్జున, శ్రీవేంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల సీనియర్
ప్రొఫెసర్లు, ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నిపుణులు, నిరుద్యోగులతో
చర్చించి... వారి సలహాలతో సిలబస్, పరీక్షల్లో సమూల మార్పులు తెస్తాం.
గ్రూపు-1, గ్రూపు-2 తోపాటు డిగ్రీ, జూనియర్ కళాశాలల లెక్చరర్ల భర్తీ తదితర
నోటిఫికేషన్లను ఈ నెలలోనే విడుదల చేస్తాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల
భర్తీకి డిసెంబరులో రాత పరీక్షలు ఉంటాయి’ అని కమిషన్ కార్యదర్శి
జె.ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు.
ఏ పోస్టులు ఎన్నంటే...
డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు-267, పాలిటెక్నిక్ కళాశాలల
అధ్యాపకులు-99, టీటీడీ డీఎల్, జేఎల్-78, జూనియర్ కళాశాలల అధ్యాపకులు-47,
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్-38, ఇంగ్లిష్ రిపోర్టర్స్ (ఏపీ
లెజిస్లేచర్ సర్వీస్)-10, గ్రంథపాలకులు (కళాశాల విద్య)-23, ఏపీఆర్‌ఈఐ
సొసైటీ కింద 10 జేఎల్, 05 డీఎల్ పోస్టులు, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో 4
డెవలప్‌మెంట్ ఆఫీసర్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో 4 గ్రంథ
పాలకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇవే కాకుండా...
భూగర్భ నీటిపారుదల శాఖ, జిల్లా సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ
ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీస్, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్, ఏపీ
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఏపీ మున్సిపల్ ఎకౌంట్స్ సబ్
సర్వీసెస్‌లో జూనియర్ ఎకౌంట్ ఆఫీసర్ కేటగిరీ-2, సీనియర్ ఎకౌంటెంట్
కేటగిరీ-3, జూనియర్ ఎకౌంటెంట్ కేటగిరీ-4 కింద మరికొన్ని పోస్టుల భర్తీకీ
నోటిఫికేషన్లను ఈ నెలలోనే ఏపీపీఎస్సీ జారీ చేయనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి