APPSC: గ్రూపు-2 ప్రిలిమ్స్ కటాఫ్ ఎంతంటే?
APPSC: గ్రూపు-2 ప్రిలిమ్స్ కటాఫ్ ఎంతంటే?
* 50 నుంచి 60 మార్కుల మధ్య ఉండే అవకాశం
* 8 వారాల్లోగా ఫలితాలు
* జూన్ లేదా జులైలో మెయిన్స్ నిర్వహణ
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25న నిర్వహించిన గ్రూపు-2 ప్రిలిమ్స్‌లో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ జనరల్ కేటగిరి కటాఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2.30 గంటల పరీక్షకు తగ్గట్లు ప్రశ్నలు లేకపోవడంతో సమయం సరిపోక హైరానా పడ్డారు. ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీలో ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ‘ఇండియన్ సొసైటీ’ కింద రాజ్యాంగం, ప్రభుత్వ పథకాలు, గణాంకాలతో కూడిన ప్రశ్నలు వచ్చాయి. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో జవాబుల గుర్తింపునకు మరింత సమయం పట్టింది. ఈ పరిణామాలు గ్రామీణ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాయి. బ్లూప్రింట్, వెయిటేజ్‌కు తగ్గట్లు ప్రశ్నపత్రం లేదని, పోటీ స్ఫూర్తి అందులో కనిపించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. పోస్టుల సంఖ్యను అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
* ‘ఆడుదాం ఆంధ్రా’పై ప్రశ్నలు
వర్తమాన వ్యవహారాల్లో ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులు, విశాఖపట్నంలో జరిగిన మిలాన్-2024 గురించి ప్రశ్నలొచ్చాయి. మెంటల్ ఎబిలిటీలో విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, ఆడుదాం ఆంధ్రాలను ఉదహరిస్తూ ప్రశ్నలు అడిగారు. జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న జీవన క్రాంతి పథకం, వైయస్‌ఆర్ నవోదయ పథకాలు, విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చిన అవార్డు గురించి ప్రశ్నలు ఇచ్చారు.
* 87.17% మంది హాజరు
గ్రూపు-2 మెయిన్స్‌ను జూన్ లేదా జులైలో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ సూత్రప్రాయంగా వెల్లడించారు. వీలైతే మేలో కూడా జరిపే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రిలిమ్స్ ఫలితాలను అయిదు నుంచి ఎనిమిది వారాల్లోగా వెల్లడిస్తాం. గ్రూపు-2 నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులకు 4,83,535 మంది దరఖాస్తు చేశారు. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్ష రాశారు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ను తొలుత ప్రకటించినట్లే మార్చి 17న నిర్వహిస్తాం. అందులో ఎలాంటి మార్పు లేదు. చిత్తూరు జిల్లాలో నకిలీ అడ్మిట్‌కార్డుతో ఒకరు పరీక్ష రాసేందుకు రాగా సిబ్బంది పట్టుకున్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు’ అని గౌతం సవాంగ్ వెల్లడించారు.
* చిత్తూరులో నకిలీ అడ్మిట్‌కార్డు దుమారం
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి ఏపీపీఎస్సీ దృష్టికి వెళ్లిన ఓ సమాచారం గందరగోళాన్ని సృష్టించింది. పరీక్షకు నకిలీ అడ్మిట్‌కార్డుతో వచ్చిన ఒకరిని పట్టుకున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. అయితే నకిలీ అడ్మిట్‌కార్డుతో ఎవరూ పరీక్షకు హాజరు కాలేదని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ‘ఓ అభ్యర్థి తన పరీక్షా కేంద్రమైన.. నారాయణ కళాశాల, మర్రిమానువీధి చిరునామా ఎక్కడో చెప్పాలని ఫోన్ చేశారు. ఈ కేంద్రం చిత్తూరులో లేదని చెప్పాం. పరిశీలన కోసం వివరాల్ని ఏపీపీఎస్సీకి పంపించాం. వాళ్లు కూడా ఈ కేంద్రం చిత్తూరులో లేదని బదులిచ్చారు’ అని జిల్లా అధికారులు వివరణ ఇచ్చారు. సదరు అభ్యర్థి తిరుపతిలోని నారాయణ కళాశాలకు వెళ్లబోయి చిత్తూరుకు వచ్చారని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు