22, జనవరి 2021, శుక్రవారం

ఎస్బీఐ పీఓ మెయిన్‌ అడ్మిట్‌ కార్డుల విడుదల

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీఓ) పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఈనెల 29న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మెయిన్‌ పరీక్ష జరుగనుంది.  

మెయిన్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. పరీక్షను మూడు గంటల్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష కూడా కంప్యూటర్‌ ఆధారితంగానే ఉంటుంది.  

దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2 వేల పీఓ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో ఎస్సీలకు 300, ఎస్టీలకు 150, ఓబీసీలకు 540, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 200, జనరల్‌ కేటగిరీలో 810 చొప్పున పోస్టులు ఉన్నాయి. పీఓ ఎంపిక విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యింది. ఈ నెలాఖరులో మెయిన్‌ పరీక్ష జరుగనుంది. ఇందులో ఎంపికైనవారిని ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌ డిస్కషన్‌కు ఆహ్వానిస్తారు.

 వెబ్‌సైట్‌: sbi.co.in

కామెంట్‌లు లేవు: