రక్షణ కొలువుకు దారి
రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవచ్చు.
రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవచ్చు. అలాగే విద్యతోపాటు త్రివిధ దళాలకు కావాల్సిన నైపుణ్యాలనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)- 2024తో దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు భర్తీ చేస్తారు.
దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి పరీక్ష తప్పనిసరి. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. అలాగే కొత్తగా ప్రారంభమైన 19 సంస్థల్లో ఆరో తరగతిలోనే విద్యార్థులను చేర్చుకుంటారు. వీటికి సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలు జారీ చేస్తుంది. కొత్తగా ప్రారంభమైన ప్రతి పాఠశాల కనీసం 40 శాతం సీట్లను ఆల్ ఇండియా మెరిట్ లిస్టు ప్రకారం భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం... ఇలా పలు విభాగాల్లో ఈ స్కూళ్లు నడుస్తున్నాయి. అందువల్ల ఫీజు ఒకేలా ఉండదు.
ప్రయోజనాలెన్నో
పరీక్ష ఇలా
తొమ్మిదో తరగతికి: 400 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు వస్తాయి. సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి సిలబస్ నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. మ్యాథ్స్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇంగ్లిష్, ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ ఒక్కో విభాగం నుంచీ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది.
రెండు తరగతుల ప్రవేశాలకు సంబంధించి పరీక్ష సిలబస్ వివరాలు ప్రకటించారు. సబ్జెక్టులవారీ ఆ పాఠ్యాంశాలను చదువుకుంటే సరిపోతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. వాటికి సమాధానాలను ఓఎంఆర్ పత్రంపై గుర్తించాలి. పరీక్షలో అర్హత సాధించడానికి సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే మొత్తం మీద 40 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో విజయవంతమైనవారిని ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేర్చుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.
సీట్లు.. ఫీజు
మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్ స్కూల్ ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారికి దక్కుతాయి. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఆరో తరగతిలో 78, తొమ్మిదిలో 22 సీట్లు ఉన్నాయి. కలికిరి సైనిక్ స్కూల్‌లో ఆరో తరగతిలో 105, తొమ్మిదిలో 10 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లోని 67 శాతం సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు. సైనిక స్కూళ్లలో చేరిన విద్యార్థులు ఫీజు చెల్లించాలి. బోధన, వసతి, భోజనం అన్నీ కలిపి ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు అవసరమవుతాయి. అయితే మెరిట్ విద్యార్థులు, అల్పాదాయ వర్గాలకు రాష్ట్రాలు స్కాలర్‌షిప్పు అందించడం లేదా ఫీజు మినహాయించడం చేస్తున్నాయి. కొత్తగా ప్రారంభమైన ఆదానీ వరల్డ్ స్కూల్ నెల్లూరులో ఆరో తరగతిలోకి 80 సీట్లు కేటాయించారు.
ఏయే అర్హతలు?
ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. అలాగే మార్చి 31, 2024 నాటికి వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2012 - మార్చి 31, 2014 మధ్య జన్మించినవారు అర్హులు. తొమ్మిదిలో చేరాలనుకున్నవారు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. వయసు మార్చి 31, 2024 నాటికి 13 నుంచి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2009 - మార్చి 31, 2011 మధ్య జన్మించినవారు అర్హులు.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగిలిన అందరికీ రూ.650.
పరీక్ష తేదీ: జనవరి 21
పరీక్ష కేంద్రాలు: ఏపీలో..అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్.
వెబ్‌సైట్: https://exams.nta.ac.in/AISSEE/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి