ఎయిర్‌పోర్ట్ అథారిటీలో..496 జేఈ కొలువులు!
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు
వార్షిక వేతనం రూ.13 లక్షలు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటన వెలువరించింది. సైన్స్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడవచ్చు. ఆన్‌లైన్ పరీక్షతో నియామకాలు ఉంటాయి. ఈ అవకాశం వచ్చినవారు ఏడాదికి రూ.13 లక్షల వేతనం అందుకోవచ్చు. పదోన్నతులతో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.
ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటి. ఎయిర్ పోర్టుల సమర్థ నిర్వహణలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సేవలే కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు పర్యవేక్షిస్తూ, ప్రయాణం సాఫీగా జరిగేలా చూస్తారు. ఇందుకు గానూ వీరికి రూ.40 వేల మూలవేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి వీరు రూ.13 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం
ముందుగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. పరీక్షలో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వాయిస్ టెస్టు ఉంటుంది. అనంతరం సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్టు, సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్టు, మెడికల్ టెస్టు, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వీటిలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. తుది నియామకాలు రాత పరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఏటీసీ) పోస్టుల్లో చేరేవారు శిక్షణ అనంతరం కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.7 లక్షల విలువైన ఒప్పందపత్రంపై అంగీకారం తెలపాలి. శిక్షణలో ఉన్నప్పుడు ఐసీఏవో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లెవెల్ 4 (ఆపరేషనల్)లో ఉత్తీర్ణత సాధించాలి.
పరీక్ష ఇలా
ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. పార్ట్ ఏ, బీల నుంచి 60 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఏలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20, జనరల్ ఇంటెలిజెన్స్/రీజనింగ్ 15, జనరల్ ఆప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ 15, జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. బీలో ప్లస్2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ నుంచి కాన్సెప్ట్, అప్లికేషన్స్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏ, బీ ఒక్కో దానికీ 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. రుణాత్మక మార్కులు లేవు.
సన్నద్ధత
- పార్ట్ బీలో ఎక్కువ మార్కులు పొందడానికి 11, 12 తరగతుల మ్యాథ్స్, ఫిజిక్స్ పుస్తకాలు బాగా చదవాలి. వాటిలోని ప్రాథమికాంశాలు, అనువర్తనాలపై దృష్టి సారించాలి.
- పార్ట్ ఏలో ప్రశ్నలు తేలికగానే ఉంటాయి. బ్యాంక్ క్లర్క్ పరీక్ష స్థాయిలో వీటిని అడుగుతారు.
- ఐబీపీఎస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీఎస్సీ, బీటెక్ అభ్యర్థులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పరీక్షను సులువుగానే
- ఎదుర్కోవచ్చు.
- ప్రతి విభాగంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
- గతంలో నిర్వహించిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏటీసీ ప్రశ్నపత్రాలు పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. పరీక్ష, ప్రశ్నల తీరు, సన్నద్ధతపై అవగాహన వస్తుంది.
- జనరల్ నాలెడ్జ్/ అవేర్‌నెస్ విభాగంలో వర్తమానాంశాలతోపాటు విమానయానం, ఎయిర్ పోర్టులకు సంబంధించిన ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.
- సన్నద్ధత పూర్తయిన తర్వాత పరీక్షలోపు కనీసం పది మాక్ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు తగ్గించుకోగలిగితే విజయానికి అవకాశం ఉంటుంది.
- రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలను సైతం ఆలోచించి, ఏదో ఒక జవాబు గుర్తించుకోవచ్చు.
ముఖ్య వివరాలు
ఖాళీలు: 496. వీటిలో విభాగాల వారీ అన్ రిజర్వ్‌డ్ 199, ఓబీసీ
ఎన్‌సీఎల్ 140, ఈడబ్ల్యుఎస్ 49, ఎస్సీ 75, ఎస్టీ 33 ఉన్నాయి. వీటిలోనే
దివ్యాంగులకు 5 కేటాయించారు.
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్ (ఏదైనా
సెమిస్టర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండడం తప్పనిసరి) కనీసం 60 శాతం
మార్కులు ఉండాలి. ఆంగ్ల భాషలో రాత, మాట్లాడే నైపుణ్యాలు అవసరం.
వయసు: నవంబరు 30, 2023 నాటికి 27 ఏళ్లు మించరాదు. దివ్యాంగులకు పదేళ్లు,
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు
చెల్లించనవసరం లేదు. ఏఏఐలో ఏడాది అప్రెంటీస్ పూర్తిచేసినవారికీ ఫీజు
మినహాయించారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/recruitment
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి