14, నవంబర్ 2023, మంగళవారం

రక్తపోటు పెరిగితే? ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే ‘హైపర్‌టెన్షన్‌’ కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే ‘హైపర్‌టెన్షన్‌’ కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది. కాబట్టి అధిక రక్తపోటు లక్షణాల కోసం ఎదురు చూడకుండా, తరచుగా బీపీ పరీక్ష చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

నల్లాలో నీరు తగినంత ఫోర్స్‌తో వస్తేనే ధార చక్కగా పడుతుంది. నీటి వేగం ఎక్కువైనా, తక్కువైనా ధారలో తేడా వచ్చినట్టే, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో హెచ్చుతగ్గులైనా రక్తపోటులో తేడా వస్తుంది. ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తంలో కొంత ప్రెషర్‌ ఉంటుంది. ఆ ప్రెషర్‌ వల్లే గుండె నుంచి రక్తం శరీరంలోని ప్రతి ఒక్క రక్తనాళంలోకి సక్రమంగా స్రవిస్తుంది. ఆ ప్రెషర్‌ అవసరానికి మించి ఎక్కువ ఉంటే ఆ పరిస్థితినే ‘హైపర్‌టెన్షన్‌’ అంటారు. 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లకు బ్లడ్‌ ప్రెషర్‌ 140/90 వరకూ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పసికందులు, స్కూలుకి వెళ్లే వయసు పిల్లలకు బీపీ ఇంకా తక్కువగా ఉంటుంది. అది సాధారణమే! ఇక 50 ఏళ్లు దాటిన వారికి వయసుతోపాటు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది. రక్తపోటు పెరిగిపోతే ఆ ప్రభావం ప్రధానంగా గుండె మీద పడుతుంది. వేగంగా గుండెకు రక్తం చేరుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె కండరాలు, కవాటాల్లో సమస్యలు మొదలవుతాయి. రక్తాన్ని వడగట్టే మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? అనే విషయాల్లోకి లోతుగా వెళ్తే కచ్చితమైన సమాధానం దొరకకపోవచ్చు. హైపర్‌టెన్షన్‌కు ఎన్నో కారణాలుంటాయి. వయసుతో పని లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా హైపర్‌టెన్షన్‌ రావొచ్చు. అయితే అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవేంటంటే....

అధిక బరువు: అధిక బరువు వల్ల శరీరం లావవుతుంది. దాంతో చర్మం ఉపరితలం వరకూ రక్తసరఫరా జరపటం కోసం రక్తనాళాలు చెట్టు కొమ్మల్లా పెరుగుతూ పోతాయి. వాటి చివర్ల వరకూ రక్తం సరఫరా కావాలంటే రక్తం ఫోర్స్‌ పెరగాలి. ఇందుకోసం గుండె మరింత బలంగా రక్తాన్ని పంప్‌ చేయాలి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రక్తంలో ప్రెషన్‌ పెరిగిపోయి హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది.

ఒత్తిడి: మానసికం, శారీరకం...ఒత్తిడి ఎలాంటిదైనా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఒత్తిడితో కూడిన జీవనవిధానాన్ని అవలంబించేవాళ్లు హైపర్‌టెన్షన్‌కి తేలికగా గురవుతారు.

అస్థవ్యస్త జీవనశైలి: సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకపోవటం, రోజుల తరబడి నిద్రకు దూరం కావటం, భోజనానికి నియమిత వేళలు పాటించకపోవటం...ఇలాంటి అస్తవ్యస్త జీవనశైలిని అనుసరించినా అధిక రక్తపోటు ఖాయమే!

అధిక ఉప్పు: ఉప్పు (సోడియం క్లోరైడ్‌)లో ఉండే ‘సోడియం’ వల్లే ముప్పంతా! కాబట్టి సోడియం ఉండే పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది.

దురలవాట్లు: హైపర్‌టెన్షన్‌కు మద్యపానం, ధూమపానం కూడా కారణమే! ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో గుండె రక్తాన్ని బలంగా పంప్‌ చేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హైపర్‌టెన్షన్‌ మొదలవుతుంది. మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. మద్యపానం వల్ల రక్తపోటు పెరుగుతుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. మద్యపానం ప్రస్తుతం ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ కావటంతో వారాంతాల్లో మద్యం సేవించటం పరిపాటిగా మారింది. వీకెండ్స్‌లో మద్యం సేవించి సోమవారంనాడు హై బీపీతో వైద్యుల్ని కలిసేవాళ్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.

ఆధునిక జీవనశైలి: గ్రామీణ జీవనశైలిని గడిపే వాళ్లలో రక్తపోటు సమంగా ఉండటం, పట్ణణీకరణ పెరిగిన తర్వాత బీపీ పెరగటం వైద్యపరమైన పరిశీలనల్లో కనిపించింది. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు గ్రామీణుల్లో కూడా అధిక రక్తపోటు సర్వసాధారణమైపోయింది. ఇందుకు కారణం గ్రామాల్లో పట్టణ వాతావరణం ఉండటమే!

మధుమేహం: మధుమేహం ఉన్నా ఆ ప్రభావం బ్లడ్‌ ప్రెషర్‌ మీద పడుతుంది. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది.

లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు

రక్తపోటు ఉన్న వాళ్లలో చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడితే తప్ప తమంతట తాముగా రక్తపోటు ఉన్న విషయాన్ని ఎక్కువశాతం మంది గ్రహించలేరు. అయితే ఇదే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే...

• గుండె దడ

• తలనొప్పి, చమటలు పట్టడం

• కళ్లు తిరగటం

• ఆయాసం

చికిత్స తేలికే!

రక్తపోటును మందులతో నియంత్రించవచ్చు. అయితే మందులు సక్రమంగా వాడుతున్నా రక్తపోటు అదుపులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నెలకోసారి బీపీ పరీక్షించుకుంటూ ఉండాలి. దాన్నిబట్టి వైద్యులు మందుల పవర్‌ పెంచటం, తగ్గించటం చేస్తారు. కొన్నిసార్లు మందుల ప్రభావం ఎక్కువై బీపీ తగ్గిపోతుంది కూడా! అలాంటప్పుడు రక్తపోటును స్థిరంగా ఉంచే మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.

హైపర్‌టెన్షన్‌ని నిర్లక్ష్యం చేస్తే?

35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. ఇలాకాకుండా లక్షణాలు కనిపించలేదు కదా! అని రక్తపోటు కలిగి ఉండీ బీపీ పరీక్షించుకోవటం నిర్లక్ష్యం చేస్తే...అంతర్లీనంగా జరగరాని నష్టం జరిగిపోతుంది. రక్తపోటును సరిచేయకుండా వదిలేస్తే ఒత్తిడి పెరిగి గుండె పెద్దదవుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హార్ట్‌ ఫెయిల్‌ అవ్వొచ్చు. ఇదేకాకుండా రోగికి మూత్రపిండాలు కూడా ఫెయిల్‌ అవ్వొచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ప్రెషర్‌ పెరిగిపోయి లేదా రక్తనాళాలు చిట్లిపోయి పెరాలసిస్‌ స్ట్రోక్‌ రావొచ్చు.

హైవర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే?

రక్తపోటు అదుపులో ఉంచుకోవటం మన చేతుల్లో పనే! ఇందుకోసం అనుసరించివలసిన నియమాలు...

• మందులు సక్రమంగా వాడాలి. రక్తపోటుకు చికిత్స దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వైద్యులు సూచించినంత కాలం క్రమం తప్పకుండా మందులు వాడాలి.

• ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, సోడా ఉప్పు వేసి వండిన వడలు, గారెలు, బజ్జీలు, బ్రెడ్‌, బిస్కెట్లు, కేక్‌లు లాంటివి తినకూడదు. అలాగే సాల్టెడ్‌ చిప్స్‌, బిస్కెట్లు కూడా మానేయాలి.

• వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం అరగంటపాటైనా నడక లేదా జాగింగ్‌ చేయాలి.

హైపర్‌టెన్షన్‌

ఉప్పు అన్నిట్లోనూ!

మనం తినే ప్రతి కూరగాయలో, పళ్లల్లో, ఆకు కూరల్లో సహజసిద్ధంగానే కొంత ఉప్పు ఉంటుంది. వీటితో శరీరానికి సరిపడా సోడియం అందుతుంది. అయినా మనం రుచి కోసం వండేటప్పుడు ఉప్పును జోడిస్తూ ఉంటాం. నిజానికి ఇలా ఉప్పు అనేదే వాడకుండా ఆహారం తినగలిగితే రక్తపోటు అనేదే రాదు. ఇలా ఉప్పు వాడే సంప్రదాయం లేని జాతులు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. వాళ్లలో రక్తపోటు కనిపించకపోవటాన్ని వైద్యులు గమనించారు. దీన్నిబట్టి ఉప్పు నియంత్రిస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని రుజువైంది కాబట్టి ఆహారంలో ఉప్పు వాడకం సాధ్యమైనంత తగ్గించాలి. కొంతమంది భోజనం చేస్తున్నప్పుడు కూరలో ఉప్పు తక్కువైందని కలిపేసుకుంటూ ఉంటారు. అలాగే పెరుగన్నం కూడా ఉప్పు లేనిదే తినరు. ఈ అలవాట్లు మానుకోవాలి. ఇంట్లో బిపి పేషెంట్లు ఉన్నప్పుడు వంటల్లో ఉప్పు సాధ్యమైనంత తక్కువ వాడాలి.

యోగాతో

రక్తపోటు స్థిరత్వం

యోగా వల్ల ఒరిగే అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో రక్తపోటు అదుపులో ఉండటం ఒకటి. యోగా వల్ల సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 140 ఒక పది మిల్లీమీటర్లు, డయాస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 90 ఒక ఐదు మిల్లీమీటర్ల దాకా తగ్గుతుంది. రక్తపోటును తగ్గించే వ్యాయామంగా యోగా అంతర్జాతీయంగా ఆమోదం పొందింది. యోగాతోపాటు ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: