ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఎత్తు వివాదంలో కోర్టును ఆశ్రయించిన 24 మంది అభ్యర్థులకు హైకోర్టు పర్యవేక్షణలో, కోర్టు ప్రాంగణంలో ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది. అయితే, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇచ్చిన వివరాలు వాస్తవమని తేలితే ఒక్కో పిటిషనర్ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కొలతలకు సిద్ధంగా ఉన్న పిటిషనర్ల వివరాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి. నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఎస్‌ఐ నియామక ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షలకు డిజిటల్ విధానాన్ని అవలంభించడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఛాతీ కొలత, ఎత్తు విషయంలో డిజిటల్ కొలతలు తీసుకోవడంతో చాలా మంది అభ్యర్ధులు అనర్హులయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మాన్యువల్ విధానాన్ని అనుసరించి ఎత్తును నిర్ధారించాలని బోర్టును ఆదేశించారు. దీనికి అనుగుణంగా మాన్యువల్ విధానంలో ఎత్తును నిర్ధారించిన అధికారులు పిటిషనర్లను అనర్హులుగా ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఎ. దుర్గాప్రసాద్ సహా 23 మంది మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వీరి వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎస్‌ఐ ఎంపిక ఫలితాలను ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. శుక్రవారం ఈ అప్పీల్ విచారణకురాగా బోర్డు తరఫున జీపీ కిశోర్ కుమార్, పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
మహిళా పోలీసుల ఉత్తర్వులు రద్దు చేయండి
● పిటిషనర్ తరఫు వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాతపూర్వక వాదనలు ఓ వారంలో సమర్పించాలని ఇరువైపుల న్యాయవాదులకు సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు. మరోవైపు కొంతమంది మహిళా కార్యదర్శులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు బాలాజీ వడేరా, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగిస్తోందన్నారు. వారిని దొడ్డిదారిలో పోలీసుశాఖలోకి తీసుకొచ్చిందని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేయాలని కోరారు. అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సాధారణ పోలీసులకు ఉండే అధికారాలు మహిళా పోలీసులకు ఉండవని తెలిపారు. మహిళా పోలీస్‌గా వారిని సంబోధిస్తారు తప్ప పోలీస్ విధులు నిర్వర్తించేందుకు వారిని అనుమతించబోమన్నారు. యునిఫాం ధరించారనే కారణంతో వారిని రెగ్యులర్ పోలీసుగా చూడకూడదని చెప్పారు. బందోబస్తు, పోలీసుస్టేషన్ రిసెప్షన్ లాంటి సాధారణ పోలీసు కానిస్టేబుల్ విధులను మహిళా పోలీసులకు అప్పగించకుండా దిగువస్థాయి అధికారులకు డీజీపీ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి