స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట! | Medicine for women's diseases is a banana!
‘‘ వృంతచ్ఛిన్నః సలిల విధృతః కృత్తతంతు ప్రధవాత్!
కంబుభ్రాంత్యా జలవిరహితః క్షార జంబీర భృష్టః
మధ్యే మధ్యే తనుసకాలితష్టార్ద్రకేనాతిపూర్ణ
స్వాదుస్తూర్ణ భతిగర్భదండః కదల్యాః ’’అంటాడు క్షేమశర్మ. అరటిదూట వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ చెప్పిన శ్లోకమిది. అరటి చెట్టు స్తంభం(స్టెమ్) పైన డొప్పలు వలిచేస్తే, లోపల శంఖంలా తెల్లగా ఉండే సారవంతమైన భాగాన్ని అరటి ఊచ లేదా దూట అంటారు. కదళీదండం అనేది దీని సంస్కృతనామం. ఇది తెల్లగా, నిండా పీచుకలిగి ఉంటుంది. ఆహార పీచు (డయటరీ ఫైబర్) కోసమే దీన్ని వండుకుని తింటారు. అరటి గెలలను కోసేసాక ఈ అరటి స్తంభాన్ని కొట్టి బైట పారేస్తారు. దాని దుంపనుండి పిలకలొచ్చి తిరిగి మరో చెట్టు పెరుగుతుంది. చెట్టు కాండం లోపల ఉండే ఊచ పారేయవలసింది కాదు. అమూల్యమైన ఆరోగ్య సంపద దీనిలో ఉంది.
లాభాలెన్నో!
అరటి దూటలో ఉండే ఆహార పీచు పేగులకు శక్తినిస్తుంది. ఇది జీర్ణాశయ వ్యవస్థని సంరక్షిస్తుంది. కడుపులోని గ్యాసును అరికట్టి అల్సర్లు తగ్గేలా చేస్తుంది. జీర్ణకోశాన్ని శక్తిమంతం చేస్తుంది. శరీరానికి పోషకాలనిచ్చి బలాన్నిస్తుంది. చాలా మంది స్త్రీలలో తరచు కనిపించే అధిక రక్తస్రావాన్ని అరటి దూట హరిస్తుంది. కేవలం అధిక రక్త స్రావమే కాకుండా ఇతర స్త్రీ వ్యాధులకు కూడా ఔషధంలా పనిచేస్తుంది. మలబద్ధకంతో బాధపడే వాళ్లకి అరటిదూట గొప్ప ఔషధం. దీనిలో ఇందులో బి1 విటమిన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతని, రక్తపోటును నివారిస్తాయి. దీనిలో ఉండే లెక్టిన్ అనే పదార్ధానికి ఇన్సులిన్‌ను ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. అందువల్ల ఇది మధుమేహవ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. అరటి దూటకు ఉన్న మరొక లక్షణం విష దోషాలను నివారించటం. దీనితో పాటుగా కిడ్నీలను శక్తిమంతం చేస్తుంది. మూత్రంలో మంట, చీముదోషం, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తింటే అనేక ప్రయోజనాలు కనిపిస్తాయి.
ఎలా వండుకోవాలి?
సాధారణంగా అరిటి దూట మనకు మార్కెట్లో లభిస్తోంది. ఈ దూటను చక్రాలుగా తరుగుతూ ఉంటే– కొంత పీచు వస్తూ ఉంటుంది. ఈ పీచును వేలుకు చుట్టుకుంటూ బయటకు తీసివేయాలి. ఆ తర్వాత చక్రాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పసుపు నీళ్లలో వేయాలి.( లేకపోతే గాలిలోని ఆక్సిజన్ వల్ల దూట నల్లగా అయిపోతుంది). ఆ తర్వాత ఒక మూకుడులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. దూట ముక్కలను, సన్నగా తరిగిన అల్లం ముక్కలను నూనెలో వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు వేసి తగినంత నిమ్మరసం వేసుకోవాలి. ఇలా తయారుచేసిన ముక్కలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
పెరుగుపచ్చడి
ఉడకపెట్టిన ముక్కల్లో పెరుగు కలిపి కొత్తిమీర, ఆవపిండి వేయాలి. దీనిలో తాళింపు వేసుకుంటే పెరుగు పచ్చడి అవుతుంది. కొందరు ధనియాల పొడిని కూడా కలిపి పచ్చడిలా తయారుచేసుకుంటారు.
సూపు
ఈ ముక్కలను ఒక మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె వేయాలి. దీనిలో కొన్ని నీళ్లు కలిపి వేడి చేయాలి. అప్పుడు అది సూపుగా తయారువుతుంది.
కామెంట్‌లు