వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం వెనుక భారత మహిళ పాత్ర | Indian woman's role behind Australia's victory in the World Cup
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ప్రపంచ కప్ గెలుపులో మంగుళూరు మహిళ ఊర్మిళ రోజారియో కీలక పాత్ర పోషించిందనే ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కు మ్యానేజర్‌గా వ్యవహరించిన ఊర్మిళ గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు.
ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్‌తో కలిసి ప్రపంచ కప్‌ను పట్టుకుని ఉన్న ఊర్మిళ ఫొటో తాజాగా వైరల్‌గా మారింది. దాంతో ఈ భారతీయ మహిళకూ క్రికెట్‌కూ మధ్య ఉన్న సంబంధం వెలుగులోకొచ్చింది. బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉన్న ఊర్మిళ బాస్కెట్ బాల్, రోవింగ్, టెన్నిస్, బంజీ జంపింగ్ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొనేది. వీటన్నిట్లో టెన్నిస్ పట్ల మక్కువ పెంచుకున్న ఊర్మిళ ఆ క్రీడలో రాణించాలనుకుంది. ఆ క్రీడనే తన వృత్తిగా మలుచుకోవాలని కలలు కన్నది. కానీ దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదం కారణంగా టెన్నిస్ ఆటకు దూరమైంది. అయినప్పటికీ క్రీడలకు ఆమె దూరం కాలేదు. ప్రత్యక్షంగా క్రీడల్లో పాల్గొనకపోయినా, పరోక్షంగా ఆటల్లో కీలక వ్యక్తిగా తన స్థానాన్ని పదిలపరుచునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ క్రమంలో స్పోర్ట్స్ మ్యానేజ్‌మెంట్ వృత్తిని ఎంచుకుంది.
ముద్దుల కూతురు
పెన్సిల్వేనియాలోని కార్నెజీ మెల్లన్ యూనివర్శిటీలో బిబిఎ చదివిన ఊర్మిళ సొంత ఊరు కర్నాటకలోని మంగుళూరు దగ్గరున్న కిన్నిగొలి. తల్లితండ్రులైన వ్యాలెంటైన్, ఐవీ రోజారియోలు నాలుగు దశాబ్దాలుగా ఖతార్‌లోని దోహాలో ఉద్యోగాలు చేసి, ప్రస్తుతం కాఫీ ప్లాంటర్స్‌గా సాక్లెష్‌పూర్‌లో స్థిరపడ్డారు. కూతురు ఊర్మిళ గురించి మాట్లాడుతూ... ‘‘ఊర్మిళ తల్లితండ్రులుగా మేమెంతో గర్వపడుతున్నాం. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కు మ్యానేజర్‌గా ఊర్మిళ సాధించిన ఈ విజయం చిన్నదేమీ కాదు. ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడింది. ఎలాంటి సవాలునైనా అధిగమించి, పట్టుదలతో అనుకున్నది సాధించవచ్చని మా అమ్మాయి నిరూపించింది.’’ అంటూ కూతుర్ని ఆకాశానికెత్తేస్తున్నారు ఆవిడ తల్లితండ్రులు. ఊర్మిళ తల్లి ఐవీ రోజారియో దోహాలో యుజిపిసి స్కూల్‌లో టీచర్‌గా పని చేశారు. తండ్రి వ్యాలెంటైన్ రోజారియో దోహాలోని ఒక ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. 40 ఏళ్ల పాటు దోహాలో పని చేసిన ఈ జంట భారతదేశానికి తిరిగొచ్చి కాఫీ ప్లాంటర్స్‌గా స్థిరపడ్డారు. వీళ్ల నలుగురు సంతానంలో అందరికంటే ఊర్మిళ చిన్నది.
ప్రస్థానం సాగిందిలా...
ప్రారంభంలో ఖతార్ టెన్నిస్ ఫెడరేషన్‌కు మూడేళ్ల పాటు పని చేసిన ఊర్మిళ, తర్వాత ఆస్ట్రేలియాకు చేరుకుని, అడిలైడ్ క్రికెట్ టీమ్‌కు మ్యానేజర్‌గా మూడేళ్ల పాటు సేవలందించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా విమెన్స్ క్రికెట్ టీమ్‌కు టీమ్ మ్యానేజర్‌గా పని చేసింది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సమయంలో క్రికెట్ నుంచి నాలుగు నెలల పాటు లీవ్ తీసుకుని, ఖతార్‌లోని ఫుట్‌బాల్ స్టేడియం నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తర్వాత, ప్రపంచ కప్ పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కు మ్యానేజర్‌గా వ్యవహరించే అవకాశం ఆమెను వరించింది. మ్యానేజర్‌గా ఊర్మిళ క్రికెటర్ల ట్రాన్స్‌పోర్ట్, నివాస ఏర్పాట్లు మొదలైన పనులను నిర్వహిస్తుంది.
కామెంట్‌లు