20, డిసెంబర్ 2020, ఆదివారం

📚✍ప్రాంతీయ భాషల్లోనూ క్యాట్‌!✍📚


♦2021 లేదా 2022లో అమలుకు అవకాశం

🌻ఈనాడు,న్యూస్ : ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ల(ఐఐఎం)లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌)ను ప్రాంతీయ భాషల్లోనూ జరిపే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు మొదలుపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానంలో చెప్పినట్లుగా ఇంజినీరింగ్‌ లాంటి సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని, మొదట ఐఐటీల్లో ప్రారంభిస్తామని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నీట్‌ను రెండేళ్ల నుంచి ఆంగ్లం, హిందీతో పాటు మరో 11 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవలే కాలపట్టికను ప్రకటించిన జేఈఈ మెయిన్‌-2021ను కూడా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే క్యాట్‌ను కూడా అదే తరహాలో జరపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరీక్షను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో పెట్టాలని ఐఐఎం రోహ్‌తక్‌ ఆచార్యుడు ఒకరు ఇటీవల క్యాట్‌-2020 కన్వీనర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయా ఐఐఎంలు సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ఈ లెక్కన క్యాట్‌-2021 లేదా 2022లో అది కార్యరూపం దాల్చవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కామెంట్‌లు లేవు: